Chittoor District: కల్యాణ మండపం నుంచి పారిపోయిన వధువు.. వెంటనే ప్రియుడిని పెళ్లాడి పోలీస్ స్టేషన్‌కు!

Bride elope from Kalyana Vedika and married lover in Madanapalle
  • చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘటన
  • అందరూ నిద్రించిన తర్వాత కల్యాణ మండపం నుంచి పరార్
  • తమకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్‌కు
  • మేజర్ కాబట్టి ఆమె ఇష్ట ప్రకారమే నడుచుకోవాలన్న పోలీసులు
మరికొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా కల్యాణ మండపం నుంచి పారిపోయిన వధువు ప్రియుడిని పెళ్లాడింది. ఆపై రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిన్న జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. మదనపల్లెకు చెందిన యువకుడికి, అదే మండలానికి చెందిన యువతికి నిన్న తెల్లవారుజామున పెళ్లి జరగాల్సి ఉంది. శనివారమే వధూవరుల కుటుంబాలు కల్యాణ మండపానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ చడీచప్పుడు కాకుండా వధువు వెళ్లిపోయింది. తెల్లవారుజామున ఆమె లేదన్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయిన వధువు ప్రియుడిని పెళ్లాడి నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న వధూవరుల కుటుంబాలు ప్రియుడితో వచ్చిన ఆమెను చూసి షాకయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. యువతి మేజర్ కాబట్టి ఆమె ఇష్టప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ఇరు కుటుంబాల వారికి నచ్చజెప్పారు.

తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఈ నెల 3న డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చి తన తల్లిదండ్రులతో మాట్లాడారని చెప్పింది. అప్పుడేమో బలవంతపు పెళ్లి చేయమని పోలీసులతో చెప్పిన తల్లిదండ్రులు ఆ తర్వాత ఇంట్లో బంధించి పెళ్లికి ఏర్పాట్లు చేశారని, అందుకనే వెళ్లిపోయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది.
Chittoor District
Madanapalle
Marriage

More Telugu News