Uttar Pradesh: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు.. నాలుగు రాష్ట్రాలు బీజేపీవే: ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వే

BJP will Win in 4 of 5 states in next year elections
  • యూపీలో 108 స్థానాలను కోల్పోతున్న కాషాయ పార్టీ
  • పంజాబ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్
  • ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు పెరగనున్న స్థానాలు
  • పంజాబ్‌లో అతిపెద్ద పార్టీగా ‘ఆప్’
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు ఎదురైన బీజేపీకి ఇది శుభవార్తే. వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాషాయ ప్రభ మరోమారు వెలిగిపోతుందని ఏబీపీ న్యూస్-సీఓటర్-ఐఏఎన్ఎస్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని పేర్కొంది. ఈ నెల మొదటి వారంలో 1,07,193 మంది నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వస్తుందని సర్వే పేర్కొంది. 403 స్థానాలున్న యూపీలో బీజేపీ 40.7 శాతం ఓట్లతో 217 సీట్లు సాధిస్తుందని తెలిపింది. అయితే, ఈసారి 108 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీకి కోల్పోతుందని వివరించింది.  ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎస్పీ, బీజేపీ మధ్యే ఉంటుందని, ఎస్పీ 31.1 శాతం ఓట్లతో 156 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి స్థానాలు తగ్గుతాయని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ మార్కును దాటుతుందని పేర్కొంది. గత ఎన్నికల్లో 57 సీట్లు సాధించగా, ఈసారి వాటి సంఖ్య 38కి పడిపోతుందని, కాంగ్రెస్‌కు అదనంగా 21 సీట్లు వస్తాయని, దీంతో దాని బలం 32 స్థానాలకు పెరుగుతుందని వివరించింది.

40 సీట్లున్న గోవాలో బీజేపీకి 21, ఆప్‌కు 5, కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కుతాయని, ఇతరులు 10 స్థానాలు దక్కించుకుంటారని పేర్కొంది. మణిపూర్‌లోని 60 స్థానాల్లో 27 బీజేపీ ఖాతాలో పడతాయని, కాంగ్రెస్‌కు 22 స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక పంజాబ్‌లో మాత్రం కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే అంచనా వేసింది. 117 సీట్లున్న పంజాబ్‌లో ‘ఆప్’ 51 స్థానాలు గెలుచుకుంటుందని  పేర్కొంది. కాంగ్రెస్ 31 స్థానాలను కోల్పోయి 46 సీట్లకు పరిమితం అవుతుందని, అకాలీదళ్ 20 సీట్లతో మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది.
Uttar Pradesh
Punjab
Goa
Uttarakhand
Manipur
Assembly Polls
BJP
Congress
SP
AAP

More Telugu News