Police: వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని కన్న తల్లే పొట్టనపెట్టుకుంది.. వీడిన పంజాగుట్ట బాలిక హత్య కేసు

Police Arrests Two In Ajmer Linked To Punjagutta Girl Murder Case
  • నిందితులు పాతబస్తీ వారని గుర్తింపు
  • అజ్మేర్ లో ఇద్దరు నిందితుల అరెస్ట్
  • వాళ్లు యాచకులంటున్న పోలీసులు
  • ఇవాళ మధ్యాహ్నం వివరాలు వెల్లడించే అవకాశం
పంజాగుట్ట బాలిక హత్యకేసు మిస్టరీ వీడింది. కన్నతల్లే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందన్న కారణంతో మరో వ్యక్తితో కలిసి హతమార్చినట్టు తేల్చారు. ఈ మేరకు ఆమె తల్లి, ఇంకో వ్యక్తిని రాజస్థాన్ లోని అజ్మేర్ లో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు ఆ కేసు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

ఈ నెల 4న పంజాగుట్ట ద్వారకాపురికాలనీలోని ఓ దుకాణం ముందు గుర్తు తెలియని ఐదేళ్ల బాలిక మృతదేహం కనిపించిన సంగతి తెలిసిందే. ఒంటిపై కమిలిన గాయాలుండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ బాలిక ఆచూకీ తెలుసుకోవడం కోసం మర్నాడే ప్రకటన కూడా విడుదల చేశారు.

నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను అధికారులు విస్తృతంగా పరిశీలించారు. వేరే రాష్ట్రాల్లోనూ గాలించారు. ప్రత్యేక బృందం కర్ణాటకకు వెళ్లింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలకూ అమ్మాయి ఫొటోతో కూడిన ప్రకటనను పంపించారు.

ఈ క్రమంలోనే బుధవారం సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దొరికిన ఆధారంతో నిందితులు అజ్మేర్ లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. వారిద్దరూ హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు. భర్త చనిపోవడంతో ఆ బాలిక తల్లి.. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు గుర్తించారు. వారు యాచకులని తెలుస్తోంది.
Police
TS Police
Telangana
Crime News

More Telugu News