Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా రాక... స్వాగతం పలకనున్న సీఎం జగన్

AP CM Jagan will invites union home minister Amit Shah
  • తిరుపతిలో దక్షిణాది జోనల్ కౌన్సిల్ భేటీ
  • వెంకటాచలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా
  • ఎల్లుండి శ్రీవారి దర్శనం
  • సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగు పయనం
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఏపీ వస్తున్నారు. ఈ రాత్రి 7.40 గంటలకు అమిత్ షా తిరుపతి చేరుకుంటారు. అమిత్ షాకు సీఎం జగన్ స్వయంగా స్వాగతం పలకనున్నారు. సీఎం జగన్ సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడ అమిత్ షాకు స్వాగతం పలికి, అనంతరం తిరుమల వెళ్లి రాత్రి 9.30 గంటలకు స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. ఆపై తిరిగి రేణిగుంట చేరుకుని తాడేపల్లి పయనమవుతారు.

మరుసటిరోజు (ఆదివారం) మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం నుంచి తిరుపతి పయనమవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అమిత్ షా అధ్యక్షతన తిరుపతి తాజ్ హోటల్లో జరిగే దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.

కాగా, ఈ సాయంత్రం తిరుపతి వస్తున్న అమిత్ షా తాజ్ హోటల్లో బస చేయనున్నారు. ఆయన రేపు నెల్లూరు జిల్లా వెంకటాచలం వెళ్లనున్నారు. అక్కడ స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలోనూ, ముప్పవరపు ఫౌండేషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. అనంతరం తిరుపతి తిరిగి వచ్చి దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.

ఏపీలో అమిత్ షా పర్యటన మూడ్రోజులు కొనసాగనుంది. రేపు రాత్రి జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత తిరుపతిలోనే బస చేయనున్నారు. ఎల్లుండి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ఢిల్లీకి పయనమవుతారు.
Amit Shah
CM Jagan
Tirupati
Andhra Pradesh

More Telugu News