Nara Lokesh: ప్రజాబలం లేదు కాబట్టే జగన్ పోలీసు బలగాన్ని, అధికార బలగాన్ని నమ్ముకున్నాడు: నారా లోకేశ్

Nara Lokesh campaigned in Kuppam
  • కుప్పంలో స్థానిక ఎన్నికలు
  • ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న లోకేశ్
  • జగన్ సీన్ అయిపోయిందంటూ వ్యాఖ్యలు
  • తుగ్లక్ పాలనకు ప్రజలు బుద్ధి చెబుతారని కామెంట్  
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తన పర్యటనపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. కుప్పంలో పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరినీ కలిశానని వెల్లడించారు. కుప్పం ఓ దేవాలయం వంటిదని, అటువంటి నియోజకవర్గంలోకి  ఇప్పుడు దొంగలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు చొరబడ్డారని ఆరోపించారు.

గతంలో తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కుప్పం అభివృద్ధికి రూ.300 కోట్లు కేటాయించానని, కానీ ఇప్పుడు ఓట్ల కోసం కుప్పంలోనే తిష్టవేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కుప్పం అభివృద్ధికి 3 పైసలు కూడా కేటాయించలేదని లోకేశ్ విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని కుప్పంలో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో 90 శాతం హంద్రీనీవా పనులు పూర్తిచేస్తే, వైసీపీ సర్కారు మిగిలిన 10 శాతం పనులను నిలిపివేసిందని ఆరోపించారు. తద్వారా కుప్పంకి నీరు రాకుండా అడ్డుకుందని తెలిపారు. కుప్పం ప్రజలకు తమ ఇంటి గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, కానీ కుప్పంలో వైసీపీ ఓట్లు అడుగుతున్న నేతలకు తాడేపల్లి ఇంట్లోకి ప్రవేశం లభిస్తుందా? అని సందేహం వ్యక్తం చేశారు.

గెలుపుపై నమ్మకం లేనివాళ్లే అడ్డమైన పనులు చేస్తారని, ప్రజాబలం లేదు కాబట్టే జగన్ పోలీసు బలాన్ని, అధికార బలాన్ని నమ్ముకున్నాడని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ సీన్ అయిపోయిందని, తుగ్లక్ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.
Nara Lokesh
Kuppam
TDP
YS Jagan
Andhra Pradesh

More Telugu News