Varun Tej: నిహారిక పనుల్లో మేం జోక్యం చేసుకోం: వరుణ్ తేజ్

Varun Tej attends Oka Chinna Family Story pre release event
  • నిహారిక నిర్మాతగా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'
  • ఈ నెల 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
  • నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ముఖ్య అతిథిగా వచ్చిన వరుణ్ తేజ్
మెగా డాటర్ నిర్మాతగా రూపుదిద్దుకున్న వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'.... సంక్షిప్తంగా ఓసీఎఫ్ఎస్. ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిహారిక సోదరుడు, టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ, మున్ముందు వెబ్ సిరీస్ లు, సినిమాలు అనే తేడా ఉండదని, వెబ్ సిరీస్ లు కూడా సినిమాల స్థాయిలో ఉంటున్నాయని అన్నారు. సినిమాల ద్వారా కొందరికే అవకాశం వస్తుందని, కానీ వెబ్ సిరీస్ ల వల్ల అనేకమందికి ఉపాధి లభిస్తుందని వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు.

ఇక తన సోదరి నిహారిక గురించి చెబుతూ, ఆమెకు ఎప్పుడూ సొంత దృక్పథం ఉంటుందని, ఆమె పనితీరులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. తన కెరీర్ కు సంబంధించిన నిర్ణయాలన్నీ తానే తీసుకుంటుందని వెల్లడించారు. ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టు ఏడాది కిందట చెప్పిందని, ఇటీవల ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ చూడగానే నిజంగా ఆశ్చర్యపోయానని వరుణ్ తేజ్ వివరించారు. ఓసీఎఫ్ఎస్ ఓ సినిమాలా ఉందని అంటున్నారని పేర్కొన్నారు.

సంగీత్ శోభన్, సిమ్రన్ శర్మ జంటగా నటించిన ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ వేదికపై ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంట్లో ఒక్కోటి 40 నిమిషాల నిడివి గల 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ కు మహేశ్ ఉప్పాల దర్శకుడు. ఇందులో సీనియర్ నటులు నరేశ్, తులసి, స్టాండప్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా నటించారు.
Varun Tej
Oka Chinna Family Story
Pre Release Event
Niharika Konidela
ZEE5

More Telugu News