ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అప్పుడే పుట్టిన నలుగురు చిన్నారుల మృతి
- మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అగ్నిప్రమాదం
- షార్ట్ సర్క్యూట్ వల్ల న్యూ బోర్న్ వార్డులో అగ్నిప్రమాదం
- తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ... ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఇతరులతో కలిసి తాను వెంటనే ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు. వార్డు లోపల మొత్తం పొగలతో నిండిపోయి ఉందని తెలిపారు. వార్డులో ఉన్న చిన్నారులను పక్కన ఉన్న మరో వార్డులోకి తరలించామని చెప్పారు.
ఆసుపత్రిలోని మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించిందని.... ఎనిమిది నుంచి పది ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయని ఫైర్ స్టేషన్ అధికారి తెలిపారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారుల ప్రాణాలను కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని తెలిపారు.