Anantapur District: పెళ్లింట విషాదం.. మనవడి వివాహమైన కాసేపటికే నానమ్మ మృతి.. విషయం తెలిసి తండ్రి హఠాన్మరణం

SI Died after hearing his mother death in Anantapur dist
  • అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో ఘటన
  • వైభవంగా కుమారుడి వివాహం జరిపించిన తండ్రి
  • ఆ తర్వాత కాసేపటికే వరుడి తండ్రి మృతి
కుమారుడి వివాహంతో సంతోషాలు నెలకొన్న ఆ ఇంట విషాదం చుట్టుముట్టింది. పెళ్లి తంతు పూర్తయిన కాసేపటికే వరుడి నాయనమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలిసిన ఆయన కుమారుడు కుప్పకూలి మరణించాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో జరిగిందీ ఘటన. మండలంలోని కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. నిన్న ఆయన కుమారుడు గోవర్ధన్ వివాహం వైభవంగా జరిగింది.

మరోవైపు, అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటస్వామి తల్లి కోన్నమ్మ (70) మూడు రోజుల క్రితం అనంతపురంలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అయితే, అప్పటికే పెళ్లి సమయం దగ్గరపడడం, వాయిదా వేసుకునే అవకాశం లేకపోవడంతో బాధగానే వెంకటస్వామి తన కుమారుడి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో వివాహం ముగిసిన కాసేపటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి మరణించిందన్న వార్త వెంకటస్వామికి తెలిసింది. అది విన్నవెంటనే ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తల్లి, కుమారుడు మరణించడంతో పెళ్లింట విషాదం నెలకొంది.
Anantapur District
Marriage
Andhra Pradesh
Police
Tragedy

More Telugu News