Cricket: అర్ధ శతకం బాదేసిన 'అనుష్క శర్మ'.. వైరల్ గా మారిన బీసీసీఐ కామెంట్!
- 88 బంతుల్లో 52 పరుగులంటూ ట్వీట్
- తెగ మీమ్స్ క్రియేట్ చేస్తున్న నెటిజన్లు
- విరాట్ కోహ్లీ ఫొటోలు పోస్ట్ చేస్తూ సరదా వ్యాఖ్యలు
- అండర్ 19 చాలెంజర్స్ ట్రోఫీపై బీసీసీఐ ట్వీట్
- ఇండియా బీ కెప్టెన్ ఇన్నింగ్స్ పై పోస్ట్
అనుష్క శర్మ బ్యాటింగ్ లో అదరగొట్టేసింది. అర్ధ శతకంతో కదం తొక్కేసింది. జట్టును మంచి స్థానంలో నిలిపింది. ఏంటీ.. అనుష్క శర్మ క్రికెట్ ఆడిందా? కెమెరా ముందు ఆడిపాడే ముద్దుగుమ్మ.. మైదానంలో ఆటాడేసిందా? లేకపోతే ఎవరి బయోపిక్ లోనైనా నటిస్తోందా? అన్న ప్రశ్నలు మైండ్ లో గిర్రున తిరిగాయా! అదేం లేదు.. అసలు అనుష్క శర్మ క్రికెట్టే ఆడలేదు.
అయితే, ఇక్కడ అర్ధ శతకం బాదేసిన అనుష్క శర్మ వేరు. బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) చేసిన ఓ ట్వీట్ ఇన్ని ప్రశ్నలకు, సందేహాలకు తావిచ్చేసింది. ప్రస్తుతం అండర్ 19 వన్డే చాలెంజర్స్ ట్రోఫీ జరుగుతోంది. ఇండియా ఏ, బీ, సీ, డీ జట్లుగా దేశవాళీ మహిళా క్రికెటర్ల టోర్నమెంట్ అది. ఇండియా బీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అనుష్క బ్రిజ్ మోహన్ శర్మ.. అర్ధ శతకం బాదింది. దీంతో బీసీసీఐ విమెన్ తన ట్విట్టర్ ఖాతాలో ‘88 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు బాదేసిన అనుష్క శర్మ.. 140/9’ అంటూ ట్వీట్ చేసింది. పైగా ఫొటో కూడా పెట్టలేదు.
దీంతో క్రీడాభిమానులు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. మీమ్స్ క్రియేట్ చేశారు. విరాట్ ను టార్గెట్ చేసుకుని తెగ కామెంట్లు పెడుతున్నారు. ‘నాకు తెలియకుండా ఆమె ఎప్పుడు మ్యాచ్ ఆడడం మొదలుపెట్టిందంటూ’ విరాట్ అంటున్నట్టుగా.. అతడు అద్దంలో నుంచి తొంగి చూస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు, కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. ఆ ట్వీట్ కాస్తా తెగ వైరల్ అవుతోందిప్పుడు. కాగా, ఇండియా Aతో జరిగిన ఆ మ్యాచ్ లో ఆమె 114 బంతులు ఎదుర్కొని 72 పరుగులు చేసింది. అంతేకాదు.. 5 వికెట్లూ పడగొట్టింది. ఆమె ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఇండియా Aపై ఇండియా B జట్టు 92 పరుగుల తేడాతో విజయం సాధించింది. చాలెంజర్ ట్రోఫీలో విజయంతో బోణీ కొట్టింది.