Telangana: ఎల్లుండి నుంచే తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు

Inter first year exams in Telangana starts from Oct 25
  • అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు పరీక్షలు
  • పరీక్షలకు హాజరుకానున్న 4,59,237 మంది విద్యార్థులు
  • పోలీస్ స్టేషన్లకు చేరిన ప్రశ్నాపత్రాలు
ఎల్లుండి (అక్టోబర్ 25) నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులందరినీ పాస్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు నిన్న తిరస్కరించింది. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 వరకు ఫస్టియర్ ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. 70 శాతం సిలబస్ నుంచి పరీక్షలను నిర్వహిస్తున్నామని... ప్రశ్నల్లో 50 శాతానికి పైగా ఛాయిస్ రూపంలో ఉంటాయని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు పరీక్షలను రీషెడ్యూల్ చేశామని తెలిపారు. ఆదివారం కూడా పరీక్ష కొనసాగుతుందని చెప్పారు.
 
మొత్తం 4,59,237 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నట్టు తెలిపారు. 17,068 సెంటర్లలో పరీక్షలను నిర్వహిస్తున్నామని... వ్యాక్సిన్ తీసుకున్న 25 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించామని చెప్పారు. మూడు సెట్ల ప్రశ్నాపత్రాలు సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరాయని తెలిపారు.

విద్యార్థులు తెచ్చుకునే వాటర్ బాటిల్స్ ను ఎగ్జామ్ హాల్స్ లోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఉంటుందని... ఎవరికైనా జ్వరం ఉంటే ప్రత్యేక గదుల్లో వారికి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు వారి హాల్ టికెట్లను ఆన్ లైన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని... దానిపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని చెప్పారు.

కరోనా కారణంగా గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. వారంతా ఇప్పడు రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడంతో వారికి ఫస్టియర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana
Inter Exams
First Year

More Telugu News