Corona Virus: నెమ్మదిస్తుందనుకుంటున్న వేళ.. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి!

Corona Cases raising once again around the world
  • కొంపముంచుతున్న నిర్లక్ష్యం
  • ఇటలీ తప్ప మరెక్కడా అమలు కాని ఆంక్షలు
  • రష్యాలో రోజుకు వెయ్యిమంది మృతి
  • భారత్‌లో ప్రతి రోజూ 20 వేలకుపైగా కేసుల నమోదు
కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వైరస్ ప్రభావం నెమ్మదించిందనుకుంటూ నిర్లక్ష్యంగా ఉన్న ప్రజలపై మళ్లీ ప్రతాపం చూపుతోంది. అమెరికా, యూకే సహా దాదాపు అన్ని దేశాల్లోనూ మళ్లీ పెద్ద ఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇంగ్లండ్‌లో రోజుకు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెద్ద సంఖ్యలోనే సంభవిస్తున్నాయి. డెల్టా వేరియంట్‌లోని ఏవై 4.2 రకమే కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఈ రకం డెల్టా కంటే 15 శాతం ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోంది.

రష్యాలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ ప్రతి రోజు 33 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండగా, వెయ్యికిపైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 4.18 లక్షల మంది కరోనాకు బలయ్యారు. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతుండడం, ఆంక్షలు లేకపోవడమే తాజా పరిస్థితికి కారణమని అంచనా వేస్తున్నారు. మరోవైపు, ఆస్ట్రేలియాలోనూ డెల్టా వేరియంట్‌లోని తాజా రకం విజృంభణ మొదలైంది. రాజధాని కాన్‌బెర్రా, సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి నగరాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

అమెరికాలో రోజుకు 90 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐసీయూలపై ఒత్తిడి పెరుగుతోంది. కరోనా బారినపడి పెద్ద వయసు వారు ఎక్కువగా మరణిస్తున్నారు. కేసులు పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్నా, మరణాలు పెరుగుతున్నా టీకా వేయించుకునేందుకు మాత్రం అమెకన్లు ఇంకా విముఖత చూపుతూనే ఉన్నారు. టీకాలు సరిపడా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ఏడుకోట్ల మంది కనీసం ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదు. వీరివల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.

ఒక్క ఇటలీలో మాత్రం కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉద్యోగులు, ఇతర పనులకు బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా కొవిడ్ పాస్ ఉండాల్సిందేనని ప్రభుత్వం నిబంధన విధించింది. రెండు టీకాలు వేయించుకున్న వారికి ‘గ్రీన్‌పాస్’లు జారీ చేస్తున్నారు. ఇక, మన దేశంలోనూ రోజుకు 22 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
Corona Virus
India
America
England
Russia
Italy

More Telugu News