కొవిషీల్డ్, కొవాగ్జిన్ లకు బూస్టర్ డోసుగా కొత్త టీకా!
- కార్బివాక్స్ ను ఇవ్వాలని ‘బయోలాజికల్ ఈ’ విజ్ఞప్తి
- డీసీజీఐకి దరఖాస్తు చేసిన సంస్థ
- ఇప్పటికే వాక్సిన్ తీసుకున్న వారిపై ట్రయల్స్
విదేశాల్లో టీకా రెండు డోసులు వేసుకున్నా ప్రతిరక్షకాలు.. కొన్ని నెలల్లోనే తగ్గుతున్నట్టు చాలా అధ్యయనాల్లో తేలిందని, దీంతో ఆయా దేశాలు తమ ప్రజలకు బూస్టర్ డోసులను వేస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మన దేశంలోనూ సింగిల్ డోస్ కార్బివాక్స్ ను బూస్టర్ డోసుగా ఇవ్వాలని కోరింది. అందుకుగానూ ఇప్పటికే ఇతర వ్యాక్సిన్లను తీసుకున్న వారిలో కార్బివాక్స్ ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం మూడో దశ ట్రయల్స్ కు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే ఫేజ్ 2/3 ట్రయల్స్ చేసేందుకు సంస్థకు డీసీజీఐ అనుమతినిచ్చింది. 18 నుంచి 80 ఏళ్ల మధ్య వారిపై ప్రస్తుతం ఆ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరునాటికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అంతేగాకుండా పిల్లల వాక్సిన్ ట్రయల్స్ కూ గత నెలలో డీసీజీఐ అనుమతులను మంజూరు చేసింది.