Afghanistan: డ్రగ్స్ కేసు.. విజయవాడ ఆషీ ట్రేడింగ్ కంపెనీ నివాసంలో ఎన్ఐఏ తనిఖీలు

NIA conduct Searches In Vijayawada Ashi trading Company in Drugs Case
  • ఆఫ్ఘనిస్థాన్ నుంచి విజయవాడలో  ఆషీ ట్రేడింగ్ పేరుతో డ్రగ్స్ రవాణా
  • ముంద్రా పోర్టులో 2,988 కిలోల హెరాయిన్ పట్టివేత
  • కీలక సూత్రధారి సుధాకర్ భార్య పుట్టింటిలో సోదాలు
  • స్థానికుల నుంచి వాంగ్మూలాల సేకరణ
  • చెన్నై, కోయంబత్తూరులోనూ సోదాలు
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నిన్న విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ ఉన్న నివాసంలో సోదాలు చేసింది. గుజరాత్‌లోని ముంద్రాపోర్టులో ఇటీవల పెద్ద ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌తో విజయవాడకు సంబంధాలు ఉన్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నిన్న తనిఖీలు చేశారు. అలాగే, చెన్నై, కోయంబత్తూరులోనూ తనిఖీలు నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామాతో వచ్చిన కంటెయినర్లను ముంద్రా పోర్టులో పట్టుకున్నారు. సెమీ ప్రాసెస్డ్ టాల్కమ్ స్టోన్స్ ముసుగులో తరలిస్తున్న 2,988 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. గత నెల 13న డ్రగ్స్ పట్టుబడగా ఈ నెల 6న జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న మాచవరం సుధాకర్ ఈ కంపెనీని రిజిస్టర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలి పుట్టినిల్లు చిరునామా ఇచ్చారు. దీంతో అధికారులు ఆ ఇంట్లోనూ సోదాలు చేశారు. స్థానికులను విచారించి పలు వివరాలు సేకరించి, వాంగ్మూలాలు సేకరించారు. అలాగే, చెన్నై శివారులోని కోలంపక్కం వీవోసీ వీధిలోని ఓ అపార్ట్‌మెంటులో సుధాకర్, వైశాలి ఉండేవారు. దీంతో ఆ ఫ్లాట్‌లోనూ అధికారులు సోదాలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వీరిని డ్రగ్స్ ఉచ్చులోకి దింపిన కోయంబత్తూరుకు చెందిన రాజ్‌కుమార్ ఇల్లు, కార్యాలయంలోనూ సోదాలు చేశారు.
Afghanistan
Vijayawada
Ashi Trading Company
NIA
Chennai
Coimbatore

More Telugu News