Nakka Anand Babu: మేము కోర్టుకు వెళితే ఆ తహసీల్దార్ ను ఎవరూ కాపాడలేరు: నక్కా ఆనందబాబు

No one can save that Tahsildar says Nakka Anand Babu
  • మేము వదిలేసిన ఎన్నికల్లో గెలిచామని జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారు
  • దుగ్గిరాలలో 18 స్థానాల్లో వైసీపీ ఐదు చోట్ల మాత్రమే గెలుపొందింది
  • ఎమ్మెల్యే ఆర్కే సిగ్గుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారు
తెలుగుదేశం పార్టీ వదిలేసిన ఎన్నికల్లో ఘనంగా గెలిచామంటూ ముఖ్యమంత్రి జగన్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. దుగ్గిరాల మండలంలో స్థానిక నేతలు పోటీ చేసి గెలుపొందారని... 18 స్థానాల్లో వైసీపీ కేవలం ఐదు సీట్లలో మాత్రమే గెలిచిందని చెప్పారు.

అయితే టీడీపీ ఎంపీపీ అభ్యర్థికి కుల ధ్రువీకరణపత్రాన్ని ఇవ్వకుండా దుగ్గిరాల తహసీల్దార్ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ముస్లిం మహిళను నాలుగు రోజుల నుంచి తిప్పుకుంటున్నారని అన్నారు. తాము కోర్టుకు వెళ్తే తహసీల్దార్ ను ఎవరూ కాపాడలేరని చెప్పారు. ఎంగిలి కూటికి వైసీపీ కక్కుర్తి పడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిగ్గుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆనందబాబు మండిపడ్డారు. ఒక్క ఎంపీపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా? అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా సహకరిస్తున్నారని... టీడీపీ అభ్యర్థులు, వారి బంధువుల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ వాళ్లకు బడితెపూజ తప్పదని అన్నారు.
Nakka Anand Babu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News