Supreme Court: చదువుపై ఫోకస్ పెట్టండి.. పిటిషన్లు వేయడంపై కాదు: విద్యార్థికి సుప్రీంకోర్టు సలహా

focus on studying says Supreme Court after a student files a petetion
  • స్కూళ్లు తెరవాలంటూ పిటిషన్ వేసిన ఢిల్లీ స్టూడెంట్
  • కరోనా అదుపులోకి వచ్చినందున ఈ నిర్ణయం తీసుకోవాలని పిటిషన్
  • వివిధ రాష్ట్రాల్లో వేరువేరు నిబంధనలున్నాయన్న సుప్రీం
దేశంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, కాబట్టి స్కూళ్లు తిరిగి తెరవాలని ఒక 12వ తరగతి విద్యార్థి పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం స్పందించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు, నిబంధనలు వేరువేరుగా ఉన్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ధర్మాసనం తెలిపింది.

తాము ఈ ప్రాంతాలన్నింటిలో పాలనను చేతుల్లోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే విద్యార్థులు చదువుకోవడంపై ఫోకస్ పెట్టాలని, ఇలా పిటిషన్‌లు వేయడంపై కాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీన్ని పబ్లిసిటీ గిమ్మిక్కుగా తాము భావించడం లేదని, కానీ పిల్లలు ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిదని పేర్కొన్నారు.

కాగా, దేశంలో చాలా ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వినలేని పరిస్థితుల్లో ఉన్నారని, కాబట్టి మళ్లీ స్కూళ్లు తెరవాలని ఢిల్లీకి చెందిన అమర్ ప్రేమ్ ప్రకాశ్ అనే విద్యార్థి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. తాను గొంతులేని ఎందరో విద్యార్థుల తరఫున ఈ అభ్యర్థన చేస్తున్నట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.
Supreme Court
Corona Virus
Schools
Student

More Telugu News