Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడి నివాసం ముట్టడికి వైసీపీ శ్రేణుల యత్నం.. ఉద్రిక్తత

YSRCP leaders tried to attack on Ayyanna Patrudu house
  • ఎమ్మెల్యే ఉమాశంకర్ నేతృత్వంలో ఇంటి ముట్టడికి యత్నం
  • ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం
  • అయ్యన్నపై ఫిర్యాదు చేసిన ఉమాశంకర్
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నిన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి ముట్టడికి యత్నించాయి. ఈరోజు విశాఖ జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నం చేశాయి. వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరారు.

 ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన ఉమాశంకర్... అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు.

మరోవైపు వైసీపీ నేతల తీరుపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యల్లో అభ్యంతరాలు ఉంటే శాంతియుతంగా ఆందోళనలు చేయడం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం చేయవచ్చని.. కానీ, వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల కంటే అయ్యన్న ఎక్కువగా ఏమీ మాట్లాడలేదని అన్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Ayyanna Patrudu
Telugudesam
Umashankar
YSRCP
Jagan

More Telugu News