Corona Virus: మూడో డోసు వ్యాక్సిన్ అక్కర్లేదు.. తాజా అధ్యయనంలో వెల్లడి

No Need For A Vaccine Third Jab Booster Says Study
  • డెల్టా వేరియంట్‌ను నియంత్రించేందుకు మూడో డోసు ఇవ్వాలనుకుంటున్న పలు దేశాలు 
  • వీటిని అప్పుడే అమలు చేయొద్దని కోరిన డబ్ల్యూహెచ్‌వో
  • ప్రస్తుత పరిస్థితుల్లో మూడో డోస్ అక్కర్లేదన్న సైంటిస్టులు
ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా డెల్టా వేరియంట్‌ను నియంత్రించేందుకు పలుదేశాలు మూడో డోసు కరోనా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించాయి. ఈ బూస్టర్ జ్యాబ్స్ వల్ల డెల్టా వంటి వేరియంట్ల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందని ఈ దేశాల వాదన. అయితే వీటి అవసరం ప్రస్తుతం లేదని తాజాగా చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

ఇప్పుడు తీసుకుంటున్న రెండు డోసుల వ్యాక్సిన్.. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్‌పై బాగానే ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం చేసిన సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. ఈ తాజా అధ్యయనం వివరాలు ‘ది ల్యాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ప్రజానీకానికి బూస్టర్ డోస్ ఇవ్వడం సరికాదు’’ అని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు తేల్చారు. డెల్టా సహా అన్ని వేరియంట్లపై ప్రస్తుతం లభిస్తున్న వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది. కరోనా లక్షణాలు కనిపించని అసింప్టమాటిక్ కేసులను నియంత్రించడంలో వ్యాక్సిన్ కొంత వెనకబడినా కూడా బూస్టర్ డోస్ అవసరం లేదని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.

తీవ్రమైన కరోనా నుంచి వ్యాక్సిన్లు రక్షణ ఇవ్వలేవని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేవని చెప్పిన శాస్త్రవేత్తలు.. బూస్టర్ డోస్ ఇవ్వడం కన్నా ముఖ్యంగా వ్యాక్సిన్ అందని ప్రాంతాలకు వీటిని సరఫరా చేయడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇలా చేయడం వల్ల కొత్త వేరియంట్లు తయారవడాన్ని నిలువరించవచ్చని, తద్వారా మహమ్మారిని త్వరగా అంతం చేయగలుగుతామని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన అనా మరియా హెనావో రెస్ట్రెపో అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.
Corona Virus
COVID19
Booster Dose
WHO

More Telugu News