Mahesh Koneru: సాయితేజ్ కు జరిగిన ప్రమాదాన్ని విశ్లేషించిన జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ఓ

NTR PRO Mahesh Koneru analyses Saitej accident scene
  • సాయితేజ్ కు ఇటీవల రోడ్డు ప్రమాదం
  • స్పోర్ట్స్ బైకులపైనా, ర్యాష్ డ్రైవింగ్ పైనా చర్చ
  • ఘటనను స్పష్టంగా వివరించిన మహేశ్ కోనేరు
  • సాయితేజ్ తప్పులేదని వెల్లడి
  • దురదృష్టం కొద్దీ జరిగిందని వ్యాఖ్యలు
సినీ హీరో సాయితేజ్ రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. సెలబ్రిటీలు స్పోర్ట్స్ బైకుల వాడకం, బైకు రేసులు, నిర్లక్ష్యంగా, వేగంగా బండి నడపడం వంటి అంశాలపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సాయితేజ్ ప్రమాద ఘటనపై టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ పీఆర్ఓ మహేశ్ కోనేరు ఆసక్తికర విశ్లేషణ చేశారు.

ఈ ఘటనపై చాలామంది అరకొర జ్ఞానంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మహేశ్ పేర్కొన్నారు. పెద్ద బైకుల గురించి తెలియనివాళ్లే ఇలా మాట్లాడుతుంటారని, వాస్తవానికి సాయితేజ్ ఎంతో బాధ్యత, జాగ్రత్త గల వ్యక్తి అని వివరించాడు.

సాయితేజ్ ప్రమాదంపై అందుబాటులో ఉన్న వీడియోను పరిశీలిస్తే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని పేర్కొన్నారు. సాయితేజ్ ముందు ఓ ఆటో, బైక్ వెళుతూ ఇసుక కారణంగా స్లో అయి దిశ మార్చుకోవడంతో, సాయితేజ్ ఆ విషయాన్ని గుర్తించి తన బైకును స్లో చేసి వాటి పక్క నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడని మహేశ్ కోనేరు వివరించారు. కానీ ఇసుక కారణంగా సాయితేజ్ బైక్ స్కిడ్ అయిందని తెలిపారు.

"సాయితేజ్ నడుపుతోంది పెద్ద బైక్. దాని శక్తి చాలా ఎక్కువ. రోడ్డు ఉపరితలంపై ఇసుక ఉండడంతో వెనుక టైరుకు పట్టు చిక్కలేదు. ఇది చాలా సాధారణమైన యాక్సిడెంట్. బైకులు నడిపేవాళ్లకు ఇలా జరగడం కామన్. అంతేతప్ప... సాయితేజ్ కు యాక్సిడెంట్ జరిగింది ర్యాష్ గా బండినడపడం వల్లో, ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్లో కాదు.

ఘటన సమయంలో సాయితేజ్ వాడింది 700 సీసీ బైక్. 300 కిమీ వేగంతో వెళ్లడం దానిపై అసాధ్యం. ఆ బైకు వెనుక టైరుకు తగినంత బటన్ లేదని కొందరు అంటున్నారు. కానీ అది తప్పు. ఆ టైరు డిజైన్ అత్యంత భద్రమైనది. సాధారణ రోడ్లపై అది ఎంతో గ్రిప్ ను ఇస్తుంది. రోడ్డుపై ఇసుక ఉండడంతోనే జారిపోయింది.

ఈ ఘటన దురదృష్టవశాత్తు జరిగినట్టు భావించాలి. రోడ్డుపై ఇసుక ఉండడం, అదే సమయంలో వేరే వాహనాలు అడ్డు రావడం ప్రమాదానికి దారితీశాయి. ఆ సమయంలో సాయితేజ్ హెల్మెట్ ధరించి ఉన్నాడు. అతని వరకు ఎలాంటి పొరపాటు చేయలేదు. అందుకే అతడిని తప్పుబట్టడం మానేద్దాం. అతడిని, అతడి కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరిద్దాం. యాక్సిడెంట్లు ఎవరికైనా జరుగుతాయి... అంతమాత్రాన ప్రతి యాక్సిడెంట్ కు ర్యాష్ డ్రైవింగ్ కారణమని చెప్పలేం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం" అని పేర్కొన్నారు.
Mahesh Koneru
Saitej
Accident
Analysis
Tollywood

More Telugu News