Team India: టెస్టు బౌలర్ల జాబితాలో టాప్ టెన్‌లోకి బుమ్రా

Bumrah joins top ten best test bolwers club again
  • 771 రేటింగ్ పాయింట్లతో దూసుకొచ్చిన పేసర్
  • అగ్రస్థానంలో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్
  • రెండో స్థానంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు. కొన్ని రోజుల క్రితం టాప్ టెన్‌లో స్థానం కోల్పోయిన అతను మళ్లీ ఈ జాబితాలోకి దూసుకొచ్చాడు. ఓవల్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లండ్ టెస్టు రెండో ఇన్నింగ్సులో బుమ్రా అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రదర్శనతో 771 రేటింగ్ పాయింట్లు సాధించిన బుమ్రా.. అత్యుత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో 9వ స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో 908 పాయింట్లతో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (831) ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవగా.. న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ (824) మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక బ్యాట్స్‌మెన్ల జాబితాలో 903 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రూట్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (901), ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (891) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో శతకంతో అదరగొట్టిన రోహిత్ (813) రేటింగ్ పాయింట్లు భారీగా పెరిగినప్పటికీ ఐదో స్థానానికే పరిమితమయ్యాడు. టీమిండియా సారధి విరాట్ కోహ్లీ (783) 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఓవల్ మ్యాచ్‌లో రెండు అర్ధశతకాలతో అదరగొట్టిన పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా రెండు విభాగాల్లో తన ర్యాంకును మెరుగు పరుచుకున్నాడు. బ్యాటింగ్‌లో 79వ స్థానానికి, బౌలింగ్‌లో 49వ ర్యాంకుకు చేరుకున్నాడు.
Team India
ICC Test Rankings
Shardul Thakur
Rohit Sharma
Jasprit Bumrah

More Telugu News