Supreme Court: నీట్ యథాతథం.... వాయిదా వేయాలన్న పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court rejects petitions seeking NEET postponement
  • సెప్టెంబరు 12న నీట్
  • అదేరోజు ఇతర పరీక్షలు ఉన్నాయంటూ పిటిషన్లు
  • పిటిషన్లను విచారణకు స్వీకరించలేమన్న సుప్రీం
  • ఏదో ఒక పరీక్ష ఎంచుకోవాలంటూ సూచన
జాతీయ వైద్య విద్యా ప్రవేశాల పరీక్ష నీట్ ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సెప్టెంబరు 12న నీట్ నిర్వహణకు కేంద్రం కొంతకాలం కిందట ప్రకటన చేసింది. అయితే సెప్టెంబరు 12న మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్ వాయిదా వేయాలని, మరో తేదీ ప్రకటించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది.

నీట్ పరీక్ష యథాతథంగా సెప్టెంబరు 12నే జరుగుతుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 16 లక్షల మంది నీట్ రాస్తున్నారని, విద్యావ్యవస్థలపై తాము జోక్యం చేసుకుంటే ఆ ప్రభావం లక్షల మందిపై పడుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయినా ఏ కొందరి కోసమో నీట్ వాయిదా వేయడం సబబు కాదని అభిప్రాయపడింది. అందుకే ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. ఒకేరోజున అనేక పరీక్షలు ఉన్నాయని పిటిషనర్లు అంటున్నారని, అలాంటప్పుడు ఏదో ఒకటే ఎంచుకోవడం మేలని సూచించింది. 
Supreme Court
NEET
Petitions
India

More Telugu News