Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల బరిలో మమతా బెనర్జీ

Mamata Banarjee will contest Bhabanipur constituency in by polls
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మమత
  • సువేందు అధికారి చేతిలో పరాజయం
  • కలిసిరాని నందిగ్రామ్
  • తనకు అచ్చొచ్చిన భవానీపూర్ నుంచి తాజాగా పోటీ
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నందిగ్రామ్ నుంచి బరిలో దిగిన మమత తన ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే, ఆమె సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవడం తప్పనిసరి. దాంతో ఆమె భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

వాస్తవానికి మమతకు భవానీపూర్ నియోజకవకర్గం కంచుకోట లాంటిది. సువేందు అధికారితో సవాల్ చేసిన కారణంగా ఆమె నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థి శోభన్ దేబ్ ఛటోపాధ్యాయ్ పోటీచేసి గెలిచారు. అయితే నందిగ్రామ్ లో ఓటమిపాలైనా, టీఎంసీ అత్యధిక స్థానాలు గెలవడంతో మమతనే మళ్లీ సీఎం అయ్యారు. ఆమె మే 5న సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా, 6 నెలల లోపు ఎమ్మెల్యేగా గెలిస్తేనే సీఎం పదవిలో కొనసాగేందుకు వీలుంటుంది.

ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మళ్లీ పోటీచేసేందుకు వీలుగా భవానీపూర్ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే శోభన్ దేబ్ త్యాగం చేశారు. ఆయన రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తాను సీఎంగా కొనసాగాలంటే ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉందని, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఏర్పడిందంటూ మమతా బెనర్జీ ఎన్నికల సంఘాన్ని కోరడంతో భవానీపూర్ తో పాటు మరో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నేడు ప్రకటన జారీ చేసింది.

ఈ నెల 30న భవానీపూర్, షంషేర్ గంజ్, జాంగీర్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుపుతామని వెల్లడించింది. అటు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అదే రోజున ఉప ఎన్నిక చేపట్టనున్నారు.
Mamata Banerjee
By Polls
Bhabanipur
TMC
West Bengal

More Telugu News