Warangal: వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తితో దాడి, ముగ్గురిని పొడిచి చంపిన తమ్ముడు

dreaded murder in warangal three dead
  • వరంగల్ ఎల్బీనగర్‌లో ఘటన
  • పశువుల వ్యాపారం విషయంలో అన్నతో విభేదాలు
  • తలుపులను కట్టర్ తో తొలగించి ఇంట్లోకి ప్రవేశం
  • నిద్రిస్తున్న అన్న, వదిన, బావమరిదిని దారుణంగా చంపేసిన వైనం
వరంగల్‌లో ఈ తెల్లవారుజామున దారుణం జరిగింది. విభేదాల కారణంగా ఓ వ్యక్తి తన అన్న, ఆయన భార్య, బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... వరంగల్ ఎల్బీనగర్‌కు చెందిన మహమ్మద్ చాంద్‌బాషాకు, అతడి తమ్ముడు షఫీకి మధ్య పశువుల వ్యాపారానికి సంబంధించి ఏడాదిగా గొడవలు జరుగుతున్నాయి. కోటి రూపాయల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంలో అన్నపై విపరీతమైన ద్వేషం పెంచుకున్న షఫీ.. అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మరికొందరితో కలిసి అన్న చాంద్‌బాషా ఇటికి చేరుకున్న షఫీ.. ఇంటి తలుపులను కట్టర్ సాయంతో తొలగించి లోపలికి ప్రవేశించాడు. నిద్రిస్తున్న బాషా, ఆయన భార్య సమీరా బేగం, కుమారులు, బావమరిది ఖలీంపై కత్తులతో దాడి చేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాషా, సమీరా బేగం, ఖలీం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. షఫీయే తన తల్లిదండ్రులపై దాడిచేసి చంపేసినట్టు బాషా కుమార్తె పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Warangal
Telangana
Murder

More Telugu News