CC Cameras: సీసీ కెమెరాల ఏర్పాటులో.. న్యూయార్క్, లండన్, షాంఘైలను కూడా అధిగమించిన ఢిల్లీ

Delhi ahead of New York and London in CC cameras
  • ప్రపంచంలో ఢిల్లీకి అగ్రస్థానం
  • రెండో స్థానంలో లండన్
  • మూడో స్థానంలో చెన్నై
భారతీయులంతా గర్వించే ఘనతను మన దేశ రాజధాని ఢిల్లీ సాధించింది. సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో అగ్రదేశాల్లోని న్యూయార్క్, లండన్, షాంఘై వంటి నగరాలను ఢిల్లీ అధిగమించింది. బహిరంగ ప్రదేశాల్లో అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నగరంగా ఘనతను సాధించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. దీనికి ఫోర్బ్స్ ఇండియాను ప్రాతిపదికగా చూపించారు.

ఢిల్లీ ఈ ఘనతను సాధించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి చదరపు మైలుకు సరాసరిన 1826 సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. లండన్ లో 1138, ఇతర నగరాల్లో అంతకంటే తక్కువ ఉన్నాయని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించినందుకు ఇంజినీర్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఢిల్లీలో మొత్తం 2.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆప్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ బాధ్యతను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు అప్పగించింది. 2019 డిసెంబర్ నాటికే 1.05 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసింది.

ప్రపంచంలో అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో, రెండో స్థానంలో లండన్ ఉండగా... మూడో స్థానంలో మళ్లీ మన దేశానికి చెందిన నగరమే నిలిచింది. చెన్నై మూడో స్థానాన్ని దక్కించుకుంది. చెన్నైలో ప్రతి చదరపు మైలుకు 609 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ జాబితాలో మన దేశ ఆర్థిక రాజధాని ముంబై 18వ స్థానంలో నిలిచింది.
CC Cameras
Delhi
London
Chennai

More Telugu News