Unitech founders: తీహార్ జైలు నుంచి సీక్రెట్ ఆఫీస్ నడుపుతున్న యూనిటెక్ వ్యవస్థాపకులు!

Unitech founders running a secret office from Tihar Jail
  • ప్రజల నుంచి అక్రమంగా వేల కోట్లు సేకరించిన కేసులో నిందితులు
  • జైలు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించిన ఈడీ
  • నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ కు సుప్రీంకోర్టు ఆదేశం 

ప్రజల నుంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా వేలాది కోట్లు సేకరించిన యూనిటెక్ సంస్థ వ్యవస్థాపకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. ఈ కంపెనీ వ్యవస్థాపకులు రమేష్ చంద్ర, సంజయ్ చంద్ర ఇద్దరూ కలిసి  ఢిల్లీలోని తీహార్ జైల్లో సీక్రెట్ ఆఫీస్ నిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. తమ దర్యాప్తులో ఈ సంచలన విషయాలు వెల్లడైనట్లు ఈడీ తెలిపింది.

ఈ ఆఫీసును రమేష్ చంద్ర నిర్వహిస్తుండగా.. బెయిల్‌ లేదంటే పెరోల్‌పై ఉన్న సమయంలో ఆయన కుమారులు సంజయ్, అజయ్ ఇద్దరూ ఈ ఆఫీసుకు వచ్చేవారని ఈడీ వెల్లడించింది. ఈ రహస్య ఆఫీసు నుంచి వందలాది సేల్ డీడ్స్, డిజిటల్ సంతకాలు, పలు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సుప్రీంకోర్టుకు అదనపు సొలిసిటర్ జనరల్ మాధవీ దివాన్ వివరించారు.

యూనిటెక్ వ్యవస్థాపకులు తమకు అనుకూలంగా ఉండే అధికారులను జైల్లో నియమించుకున్నారని, ఇలా బయటకు తమ మాటలు చేరవేస్తున్నారని ఈడీ రిపోర్టు తెలిపింది. ఈ రిపోర్టును పరిశీలించిన సుప్రీంకోర్టు.. చంద్ర కుటుంబాన్ని తీహార్ జైలు నుంచి తొలగించి మహారాష్ట్రలోని ఆర్థర్ రోడ్, తలోగా జైళ్లకు తరలించాలని ఆదేశించింది.

ఈ చర్యలతో సంజయ్, అజయ్ ఇద్దరూ జ్యూడిషీయల్ వ్యవస్థనే అపహాస్యం చేశారని ఈడీ తెలిపింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. తీహార్ జైలు ఇటీవలి కాలంలో నేరస్థుల అడ్డాగా మారిందని, జైలు నుంచే క్రిమినల్స్ తమ కార్యకలాపాలు జరుపుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ఈ కేసుతో సంబంధమున్న జైలు అధికారులపై దర్యాప్తు జరిపి, 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.

  • Loading...

More Telugu News