Taliban: సాయం కోరినా స్పందించని దేశాలు.. తాలిబన్లకు లొంగిపోనున్న అహ్మద్ మసూద్?

AntiTaliban leader Massoud wants to talk with taliban
  • ఇన్నాళ్లూ తాలిబన్ల వశం కాకుండా పంజ్‌షీర్‌కు కాపలా కాసిన మసూద్
  • అంతర్జాతీయంగా అందని సహకారం
  • ఇప్పటికే ప్రావిన్స్‌ను చుట్టుముట్టిన తాలిబన్లు
  • రాజీ తప్ప మరో మార్గం లేదని యోచిస్తున్న అహ్మద్ షా
దేశం మొత్తం తాలిబన్ల వశమైనా పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో అడుగుపెట్టకుండా అడ్డుకున్న ‘పంజ్‌షీర్ సింహం’ అహ్మద్ షా మసూద్ తాలిబన్లకు లొంగిపోయి ప్రావిన్స్‌ను వారి చేతుల్లో పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పోరాటానికి తగిన వనరులు అందుబాటులో లేకపోవడం, సాయం కోరినా అంతర్జాతీయ సమాజం నుంచి స్పందన లేకపోవడంతో ఒంటరిగా మారిన 32 ఏళ్ల అహ్మద్ షా తాలిబన్లతో రాజీ కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

తమ బలం చాలా తక్కువగా ఉందని, తాలిబన్లతో పోరాడడం ఇక అసాధ్యమని మసూద్ సలహాదారుడు ఒకరు ఓ వార్తా సంస్థతో చెప్పారు. 1980, 1990ల నాటి పరిస్థితులకు, తాజా పరిస్థితులకు మధ్య తేడా ఉందని, తాలిబన్ ఫైటర్లు ఇప్పుడు యుద్ధాల్లో పూర్తిగా ఆరితేరారని పేర్కొన్నారు. తాలిబన్లను ఎదురొడ్డుతున్న తమకు సాయం చేయాల్సిందిగా మసూద్ ఇటీవల ఫ్రాన్స్, అమెరికా, ఐరోపా, అరబ్ దేశాలను కోరినప్పటికీ ఆయా దేశాలేవీ స్పందించలేదు.

మరోవైపు, తాలిబన్లు ఇప్పటికే పంజ్‌షీర్‌ను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో తాలిబన్లతో రాజీ కుదుర్చుకుని ప్రావిన్స్‌ను వారికి అప్పగించడం మినహా మరో దారి లేదని భావిస్తున్న మసూద్ లొంగిపోవడానికే నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Taliban
Afghanistan
Ahmad Shah Massoud
Panjshir

More Telugu News