Zaki Anwari: అమెరికా విమానానికి వేళ్లాడి చనిపోయిన వారిలో ఆఫ్ఘన్ యువ ఫుట్ బాల్ క్రీడాకారుడు

Afghna youth football team player Zaki Anwari died in tragic incident
  • ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల రాజ్యం
  • దేశాన్ని వీడేందుకు ఆఫ్ఘన్ల యత్నం
  • సైనిక విమానం నుంచి జారిపడి ముగ్గురి మృతి
  • యూత్ ఫుట్ బాల్ టీమ్ సభ్యుడి దుర్మరణం
కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశిస్తున్నారన్న వార్తలతో ఆఫ్ఘన్ ప్రజలు అమెరికా సైనిక విమానం ఎక్కి దేశాన్ని వీడి వెళ్లిపోయేందుకు ప్రయత్నించడం విషాదాంతం కావడం తెలిసిందే. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంటున్న అమెరికా సైనిక రవాణా విమానం సి-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని పట్టుకుని వేళ్లాడిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఆఫ్ఘన్ యువ ఫుట్ బాల్ క్రీడాకారుడు జకీ అన్వారీ ఒకరని వెల్లడైంది.

గాల్లోంచి వ్యక్తులు జారిపడుతున్న వీడియో ఫుటేజి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో ఆఫ్ఘన్ల పరిస్థితి పట్ల అందరిలోనూ తీవ్ర విచారాన్ని నింపింది. 19 ఏళ్ల జకీ అన్వారీ కాబూల్ లోని ఎస్తెఘ్ లాల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ప్రతిభావంతుడైన ఫుట్ బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వారీ జాతీయ యూత్ జట్టులో సభ్యుడు.

తాలిబన్ల చెరలో తన ఫుట్ బాల్ కలను పండించుకోలేనని భావించిన ఆ యువకుడు, అమెరికా వెళ్లి ఆటలో రాణించాలని భావించాడు. కానీ, ప్రమాదకరరీతిలో సీ-17 వంటి భారీ విమానం ల్యాండింగ్ పరికరాలపైకి ఎక్కి దేశాన్ని వీడాలనుకున్నాడు. అయితే ఆ విమానం గాల్లోకి లేవగానే ల్యాండింగ్ గేర్ పైకి ఎక్కిన వాళ్లు కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జారిపడిపోయారు. అన్వారీ మృతిని ఆఫ్ఘన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం నిర్ధారించింది.

కాగా, ఫేస్ బుక్ లో అన్వారీ చివరి పోస్టులో... "నీ జీవిత చిత్రాన్ని గీయాల్సింది నువ్వే... నీ జీవితాన్ని గీసేందుకు కుంచెను మరొకరికి అప్పగించొద్దు" అని పేర్కొన్నాడు. తద్వారా తన దృక్పథాన్ని చాటే ప్రయత్నం చేశాడు. అన్వారీ దుర్మరణం పట్ల ఆఫ్ఘన్ ఫుట్ బాల్ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Zaki Anwari
Afghanistan
Football Player
Death
Kabul

More Telugu News