YS Sunitha Reddy: తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత

YS Sunitha wrote Kadapa SP
  • వివేకా హత్యకేసులో కొనసాగుతున్న దర్యాప్తు
  • తమ ఇంటిచుట్టూ అనుమానిత వ్యక్తి తిరిగాడన్న సునీత
  • కుటుంబ భద్రతపై ఆందోళన
  • సీఐకి ఫిర్యాదు చేసినట్టు వెల్లడి
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతున్న తరుణంలో, ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఎస్పీ లేకపోవడంతో లేఖను కార్యాలయ సిబ్బందికి అందించారు. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5.10 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడని, అదే సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత లేఖలో వెల్లడించారు.

అతడు వివేకా హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి పుట్టినరోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉన్న మణికంఠరెడ్డి అనే వ్యక్తిలాగే ఉన్నాడని ఆమె వివరించారు. ఈ విషయమై ఆగస్టు 12న సీఐ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు.

వివేకా హత్య జరిగిన తర్వాత డాక్టర్ సునీతారెడ్డి 15 మంది అనుమానితుల పేర్లను అధికారులకు అందించారు. వారిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
YS Sunitha Reddy
Kadapa SP
Letter
YS Vivekananda Reddy
Murder

More Telugu News