Mahesh Babu: నా పుట్టినరోజు నాడు ప్రతి అభిమాని 3 మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను: మహేశ్ బాబు

Mahesh Babu calls fans should plant saplings on his birthday
  • ఈ నెల 9న మహేశ్ బాబు పుట్టినరోజు
  • వేడుకలు చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి
  • గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనాలని సూచన
  • ఫొటోలకు తనను ట్యాగ్ చేయాలని వెల్లడి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ నెల 9న పుట్టినరోజు జరుపుకోనున్నారు. అయితే ఈసారి తన అభిమానులు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని మహేశ్ బాబు పిలుపునిచ్చారు. తన జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు చేయొద్దని, ప్రతి ఒక్క అభిమాని 3 మొక్కలు నాటాలని కోరుతున్నారు. ప్రతి ఏటా అభిమానులు తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎంతో ప్రేమను ప్రదర్శిస్తుంటారని మహేశ్ బాబు సంతోషం వ్యక్తం చేశారు.

ఈసారి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొని మొక్కలు నాటాలని పేర్కొన్నారు. మొక్కలు నాటిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి తనను ట్యాగ్ చేయాలని, తద్వారా ఆ ఫొటోలను తాను కూడా చూస్తానని మహేశ్ బాబు పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పరశురాం దర్శకుడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గోవాలో జరగనుంది. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మహేశ్ బాబు గోవాలో సెట్స్ పై తన పుట్టినరోజు జరుపుకుంటాడని తెలుస్తోంది.
Mahesh Babu
Saplings
Fans
Birthday
Tollywood

More Telugu News