Vijayashanti: జయశంకర్ బతికుంటే ఇప్పటి పరిస్థితి చూసి ఆయన కంట కన్నీరు ఏరులై పారేది: విజయశాంతి

Vijayasanthi pays tributes in Prof Jayashankar birth anniversary
  • ఇవాళ జయశంకర్ జయంతి
  • నివాళులు అర్పించిన విజయశాంతి
  • రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని విమర్శలు
  • ఇదేనా బంగారు తెలంగాణ అంటూ ఆగ్రహం

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు బీజేపీ మహిళా నేత విజయశాంతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ, జయశంకర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, మలిదశ ఉద్యమానికి ప్రాణమై నిలిచారని కొనియాడారు. కానీ, జయశంకర్ సార్ బతికుంటే తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి చూసి ఆయన కంట కన్నీరు ఏరులై పారేదని పేర్కొన్నారు.

"మన భూమి, మన ఉద్యోగాలు, మన నీరు మనకే కావాలని ఎందరో ఉద్యమకారులు కుటుంబాలను పణంగా పెట్టి బలిదానాలతో అమరులయ్యారు. వారి ఆశయాలకు ఈ ప్రభుత్వం ఏమాత్రమైనా విలువనిచ్చిందా? మన నీళ్లు దోపిడీకి గురవుతుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంది. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరతను సైతం అధిగమించి అన్నదాతలు పంటలు పండిస్తున్నారు. కానీ, పంటలకు మద్దతు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. విధిలేని పరిస్థితుల్లో తమ పంటకు తామే మంట పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

ఇక, రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాష్ట్రంలోని నగరాలను డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ లా మార్చేస్తామని చెప్పి తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారు. వాన చినుకు పడితే చాలు కాలనీలు నీట మునుగుతున్నాయి. కరోనా పరిస్థితుల్లో కార్పొరేట్ల దోపిడీని నిలువరించలేక ప్రజారోగ్యాన్ని అభద్రతలోకి నెట్టేశారు. ఇదేనా జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ?" అంటూ విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు.

ఇది అధికార పార్టీకి మాత్రమే బంగారు తెలంగాణ అని, ప్రజలకు కాదని స్పష్టం చేశారు. జయశంకర్ సార్ మన మధ్య ఉండుంటే ఈ పాలకులను గద్దె దింపేందుకు కచ్చితంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేవారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News