Krishna District: పులిచింత‌ల డ్యామ్‌ వ‌ద్ద మరమ్మతు ప‌నులు.. స్టాప్‌లాక్ ఏర్పాటుకు జరుగుతున్న ప్ర‌య‌త్నాలు!

Works under way at Pulichinthala dam in Krishna district where gate washed away
  • నిన్న‌ నీళ్లు వ‌దులుతుండ‌గా ఊడిపోయిన గేటు
  • ప్రకాశం బ్యారేజీకి వృథాగా నీరు
  • జలాశయంలో మరో 10 టీఎంసీలు ఖాళీ చేస్తే స్టాప్‌లాక్ ప‌నులు షురూ
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా పులిచింత‌ల డ్యామ్ నుంచి నీళ్లు వ‌దులుతుండ‌గా సాంకేతిక కార‌ణాల వ‌ల్ల‌ 16వ నంబర్‌ గేటు ఊడిపోయిన విష‌యం తెలిసిందే. దాంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వృథాగా పోతోంది. పులిచింతల ప్రాజెక్టులో అధిక మొత్తంలో నీరు నిల్వ ఉండ‌డంతో కొత్త గేటు అమర్చే ప‌రిస్థితులు లేవు.

మరోపక్క, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో నీరు వెళ్లకుండా చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. నీటి పారుదలశాఖ అధికారులు, సిబ్బంది జలాశయంలోని నీటిని దిగువకు వదిలి నీటి మట్టం తగ్గించే ప్రక్రియ కొన‌సాగిస్తున్నారు.

పులిచింతల జలాశయంలో 20 టీఎంసీల నీరు నిల్వ ఉండ‌గా, ఎగువ నుంచి లక్ష 67 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వ‌చ్చి చేరుతోంది. ఇప్ప‌టికే 19 గేట్లు ఎత్తిన సిబ్బంది 4.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. పులిచింత‌ల డ్యామ్ వ‌ద్ద విరిగిన గేటు మరమ్మతు పనులు ప్రారంభించాలంటే జలాశయంలో మరో 10 టీఎంసీలు ఖాళీ చేయాల్సి ఉందని చెప్పారు. మధ్యాహ్నానిక‌ల్లా ఖాళీ చేయొచ్చ‌ని భావిస్తున్నారు. స్టాప్‌ లాక్‌ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను సిబ్బంది ప‌రిశీలిస్తున్నారు.
Krishna District
Pulichinthala

More Telugu News