Andhra Pradesh: అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Man suicide in guntur after they attack
  • తెలంగాణ వైపు నుంచి 10 మద్యం కేసులను తీసుకొస్తుండగా పట్టుకున్న పోలీసులు
  • అరెస్టును ప్రతిఘటించడంతో చేయి చేసుకున్న పోలీసులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి  
  • తమ తప్పేం లేదన్న ఎక్సైజ్ ఎస్సై
మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడంతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మరణించాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. కొందరు యువకులు నిన్న తెలంగాణ నుంచి 10 మద్యం కేసులను ఏపీకి తీసుకొస్తుండగా వారిని పట్టుకున్న పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అల్లీసా అనే యువకుడు ఎదురు తిరగడంతో పోలీసులు అతడిపై చేయిచేసుకున్నారు. దీంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

విషయం తెలిసిన అల్లీసా కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, పురుగుల మందు తాగిన అల్లీసాను పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు గత రాత్రి మరణించాడు.

పోలీసులు దారుణంగా కొట్టడం, కాళ్లపై ద్విచక్ర వాహనాన్ని ఎక్కించడం, పొట్టపై తన్నడం వల్లే అల్లీసా మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులే మద్యం సీసాలను తమ వాహనంలో పెట్టి అక్రమంగా కేసులు బనాయించారని నిందితులు ఆరోపించారు. ఈ ఘటనపై గురజాల ఎక్సైజ్ ఎస్సై మోహన్ మాట్లాడుతూ. తాము ఎవరిపైనా దాడులు చేయలేదని, పోలీసులపైనే నిందితులు దాడి చేశారని పేర్కొన్నారు.
Andhra Pradesh
Guntur District
Liquor
Police

More Telugu News