Tokyo Olympics: ముఖానికి 13 కుట్లు పడినా వెన్నుచూపలేదు.. శభాష్​ అనిపించుకుంటున్న బాక్సర్​ సతీశ్​

Boxer Sateesh Fighting Spirit Gets Appraise From All Fronts
  • ఒలింపిక్స్ క్వార్టర్స్ లో ఓటమి
  • ప్రపంచ చాంపియన్ కు ఎదురొడ్డి పోరాటం
  • మూడో రౌండ్ లో ఊడిపోయిన కుట్లు
మొహంపై 13 కుట్లు పడ్డాయి. అయినా అదరలేదు.. బెదరలేదు. ఎదురొడ్డి రింగ్ లోకి దిగాడు. పంచ్ లు కురిపించాడు. నుదుటిపై దెబ్బ కుట్లు ఊడినా వెన్ను చూపించలేదు. అంత ధైర్యంగా పోరాడినా అతడికి ఓటమి తప్పలేదు. ఓడిపోయినా అతడి పోరాటపటిమే ఇప్పుడు అందరినీ కట్టిపడేస్తోంది.

ఒలింపిక్స్  పురుషుల బాక్సింగ్ లో భారత పోరు ముగిసింది. ఈరోజు జరిగిన క్వార్టర్స్ లో సతీశ్ కుమార్ ఓడిపోయాడు. 91 కిలోల హెవీ వెయిట్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ కు చెందిన ప్రపంచ చాంపియన్ బఖోదిర్ జలోలోవ్ తో క్వార్టర్స్ లో సతీశ్ తలపడ్డాడు. ప్రి క్వార్టర్ ఫైనల్ లో మొహం, దవడపై గాయాలై 13 కుట్లు పడినా కూడా సతీశ్ రింగ్ లోకి దిగాడు. కడవరకు తన ప్రయత్నం చేశాడు. గెలిచేందుకు ప్రయత్నించాడు.

కానీ, జలోలోవ్ దే పై చేయి అయింది. 0–5 తేడాతో సతీశ్ ఓడిపోవాల్సి వచ్చింది. స్కోరును పక్కనపెడితే ప్రతి ఒక్కరు ఇప్పుడు అతడి పోరాటాన్ని అభినందిస్తున్నారు. మూడో రౌండ్ లో ప్రత్యర్థి పంచ్ నుదుటిపై ఉన్న దెబ్బకు తగిలి కుట్లు పిగిలినా.. ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ధైర్యంగా నిలుచున్నాడు. అతడి ధైర్యాన్ని చూసి ప్రత్యర్థి జలోలోవ్ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

స్వతహాగా సైనికుడైన సతీశ్.. బాక్సింగ్ లో ఒలింపిక్స్ కు ఎంపికవ్వడమే సంచలనం. హెవీ వెయిట్ విభాగంలో ఎంపికైన తొలి భారతీయుడిగా తొలుతనే చరిత్ర సృష్టించాడు. అక్కడి నుంచి ప్రి క్వార్టర్స్  వరకు విజయపరంపరను కొనసాగించాడు.
Tokyo Olympics
Boxing
Sateesh Kumar

More Telugu News