Bhagat Singh: భగత్​ సింగ్​ ఉరితీతను అనుకరించబోయి.. ప్రాణాలు కోల్పోయిన 9 ఏళ్ల బాలుడు!

9 Years Old Student Dies After Mimicking Bhagat Singh Hanging
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • స్వాతంత్ర్య దినోత్సవం కోసం నాటకం రిహార్సల్స్
  • అనుకోకుండా మెడకు బిగుసుకున్న ఉరి
భగత్ సింగ్.. ఈ పేరు చాలు ఒంటిమీద వెంట్రుకలు నిక్కబొడుచుకోవడానికి. గుండెల్లో దేశభక్తి ఉప్పొంగడానికి. అలాంటి మహానుభావుడి మీద సినిమాలు వచ్చాయి.. వీధి నాటకాలూ జరిగాయి. స్కూళ్లు, కాలేజీల్లో స్టేజీపై విద్యార్థులూ నాటకాల రూపంలో చేసి చూపించారు.

అయితే, ఉత్తరప్రదేశ్ లో భగత్ సింగ్ నాటకం రిహార్సల్స్ లో విషాదం చోటు చేసుకుంది. భగత్ సింగ్ ఉరితీతను అనుకరించబోయిన శివమ్ అనే ఓ 9 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం బుదౌన జిల్లాలోని బబత్ లో ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్కూల్ లో భగత్ సింగ్ నాటకాన్ని ప్రదర్శించేందుకు శివమ్, అతడి స్నేహితులు నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే భగత్ సింగ్ గా శివమ్ నటించాలనుకున్నాడని అతడి బంధువులు చెప్పారు.

నాటకం చివర్లో ఉండే ఉరితీత సీన్ రిహార్సల్స్ లో భాగంగా తాడు తీసుకొచ్చిన శివమ్.. ఉరి తాడుగా కట్టి మెడకు చుట్టుకున్నాడని, దురదృష్టవశాత్తూ స్టూల్ నుంచి కాళ్లు జారడంతో మెడకు ఉరి బిగుసుకుందని తెలిపారు. అయితే, ఊపిరాడక గిలగిల కొట్టుకుంటున్న శివమ్ ను చూసి అతడి మిత్రులు.. బాగా నటిస్తున్నాడనుకున్నారని, శివమ్ లో కదలికలు పూర్తిగా ఆగిపోయాక అనుమానపడ్డారని చెప్పారు.

వెంటనే గ్రామస్థులకు ఆ విషయాన్ని తెలియజేయగా.. అప్పటికే శివమ్ చనిపోయాడన్నారు. అయితే, దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, అంత్యక్రియలు చేశామని అతడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. కాగా, గత ఏడాది మధ్యప్రదేశ్ లోని మంద్సౌర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
Bhagat Singh
Independence Day
Uttar Pradesh
Crime News

More Telugu News