Hyderabad: నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి.. హైదరాబాద్‌ శివారులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి

software engineer attacked in hyderabad chandangar
  • హైదరాబాద్ శివారులోని చందానగర్‌లో ఘటన
  • తీవ్రంగా కొట్టి, చస్తావని వదిలేస్తున్నామని చెప్పిన నిందితులు
  • అన్న జోలికొస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని హెచ్చరిక
హైదరాబాద్ శివారులోని చందానగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక హుడా కాలనీ సమీపంలోని ఇంజినీర్స్ ఎన్‌క్లేవ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన మామిళ్లపల్లి శ్రీహర్ష (28), అతడి స్నేహితుడు సాయిరాం ప్రసాద్ ఉంటున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో స్నేహితుడు బయటకు వెళ్లగా శ్రీహర్ష ఒక్కడే ఉన్నాడు.

అదే సమయంలో ఇద్దరు ఆగంతుకులు లోపలికి వచ్చి ‘‘ఎత్తుగా ఉన్న వ్యక్తి లేడా?’’ అని ప్రశ్నించారు. బిజినెస్ గురించి మాట్లాడాల్సి ఉందని చెప్పడంతో.. వస్తాడు కూర్చోమని శ్రీహర్ష చెప్పాడు. అనంతరం వారు మంచినీళ్లు అడగడంతో తీసుకొచ్చేందుకు కిచెన్‌లోకి వెళ్తుండగా వెనక నుంచి వెళ్లి శ్రీహర్షపై దాడిచేశారు. తలను గోడకేసి కొట్టడంతో కూలబడిపోయాడు.

ఆ వెంటనే అతడి చేతుల్ని తీగలతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మరోమారు దాడిచేశారు. మా అన్న జోలికి వస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని, చస్తావని వదిలేస్తున్నామని హెచ్చరించి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ఓ ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లు, ఒక ఏటీయం కార్డుతోపాటు రూ. 3,500 నగదు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత రూముకు వచ్చిన సాయిరాం స్నేహితుడి కట్లు విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నెల 15న స్థానికంగా నివసించే ఓ వ్యక్తి మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి కారులో వచ్చి శ్రీహర్ష, సాయిరాంలను దూషించడమే కాకుండా దాడి చేసి కొట్టాడు. దీంతో బాధితులు అదే రోజు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనకు అదే కారణమై ఉంటుందని భావిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Hyderabad
Chandanagar
Crime News

More Telugu News