USA: సగం మందికి వ్యాక్సిన్​ వేసినా.. అమెరికాలో భారీగా పెరుగుతున్న కేసులు!

Covid Cases Raising Rapidly in USA Stands First In Daily Cases
  • నిన్న ఒక్కరోజే 70,740 మందికి పాజిటివ్
  • రోజురోజుకు పెరుగుతున్న కేసులు
  • ఇప్పటిదాకా 16.33 కోట్ల మందికి టీకా
అమెరికాలో సగం మందికి ఇప్పటికే వ్యాక్సిన్ వేసేశారు. చాలా మంది రెండు డోసులూ తీసుకున్నారు. మాస్క్ నిబంధనలనూ ఎత్తేశారు. భౌతిక దూరమూ వద్దన్నారు. కానీ, అమెరికాలో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.

నిన్న ఒక్కరోజే దేశంలో 8.07 లక్షల టెస్టులు చేస్తే, 70,740 కేసులు నమోదయ్యాయి.   అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 5.94% పెరిగాయి. ప్రపంచంలోనే రోజువారీ కేసుల్లో అమెరికా మళ్లీ మొదటి స్థానంలో ఉంది. ఇండోనేసియాలో 45,203, బ్రెజిల్ లో 41,411 కేసులు నమోదైనట్టు అమెరికాలో రోజువారీ కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సటీ పేర్కొంది.  

అయితే, వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటిదాకా 3,54,87,490 మంది కరోనా బారిన పడగా.. 6,28,098 మంది చనిపోయారు. కాగా, నిన్న 3,95,489 వ్యాక్సిన్ డోసులు వేశారు. మొత్తంగా 16.33 కోట్ల మందికి పూర్తిగా టీకాలేశారు.
USA
COVID19
Vaccination

More Telugu News