Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ఉద్రిక్త‌త‌

ruckus at munugodu as raja gopal reddy protest
  • ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని మునుగోడులోనూ అమ‌లు చేయాల‌ని డిమాండ్
  • నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించిన రాజ‌గోపాల్ రెడ్డి
  • మునుగోడు చౌర‌స్తా మీదుగా వెళుతున్న మంత్రి కాన్వాయ్ అడ్డ‌గింత‌
  • ప‌లువురి అరెస్టు  
తెలంగాణ ప్ర‌భుత్వం ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ముందుగా హుజూరాబాద్‌లో ప్ర‌వేశ‌పెడుతుండ‌డంతో ఉప‌ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ చేస్తోన్న గిమ్మిక్కుగా ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో దళిత బంధు పథకాన్ని త‌న‌ మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమ‌టిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి త‌మ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళ‌న‌కు దిగారు. అదే స‌మ‌యంలో రేష‌న్ కార్డుల పంపిణీకోసం మునుగోడు చౌర‌స్తా మీదుగా వెళ్తున్న‌ మంత్రి జగదీశ్‌ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు  పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరుపై రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత‌లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు చేస్తుండ‌డం సరికాదని ఆయ‌న అన్నారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అరెస్ట్ చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను వెంటనే విడుదల చేయాల‌ని రాజ‌గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతం కాదని, త్వరలో తామేంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వ‌బోమ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌ వ్యాప్తంగా దళితులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మునుగోడుకు జగదీశ్‌ రెడ్డి నిధులు తీసుకురావడం లేదని చెప్పారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేంద‌ర్‌ను ఓడించేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

కాగా, ఇంత‌కు ముందు కూడా జ‌గ‌దీశ్ రెడ్డి, రాజ‌గోపాల్ రెడ్డికి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో జగదీశ్‌ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.
Komatireddy Raj Gopal Reddy
Congress
G Jagadish Reddy

More Telugu News