Aadhar Card: ఇంటి వద్దే ఆధార్‌తో ఫోన్ నంబరు అనుసంధానం చేస్తున్న పోస్టల్ శాఖ.. ఏపీలో అనూహ్య స్పందన
- రూ. 50 చెల్లిస్తే ఇంటి వద్దే సేవలు
- ఇప్పటికే 5 లక్షల మంది వినియోగదారుల ఆధార్‌తో ఫోన్ నంబరు లింక్
- పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమై రాష్ట్రమంతా సేవలు
ఆధార్‌తో ఫోన్ నంబరును అనుసంధానించుకోలేకపోయిన వారికి తపాలా శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై ఆధార్ సీడింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఇంటి వద్దే ఆ పని పూర్తిచేసేలా సరికొత్త సేవలను ఏపీలో ప్రారంభించింది. కేవలం 50 రూపాయలు చెల్లించి ఈ సేవలు పొందవచ్చు. పోస్ట్‌మ్యాన్‌కు కబురందిస్తే అతడే ఇంటికి వచ్చి క్షణాల్లో ఆధార్‌తో ఫోన్ నంబరును అనుసంధానించేస్తాడు. ఇందుకోసం వారి వద్ద ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. దీని సాయంతో ఆధార్ నంబరుకు ఫోన్ నంబరును అనుసంధానిస్తారు.
ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ సేవలను తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 5 లక్షలమంది వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ముఖ్యంగా గుడివాడ, ఏలూరు, భీమవరం, నెల్లూరు, విజయనగరం డివిజన్లలో ఎక్కువమంది ఈ సేవలు పొందారు. రాష్ట్రంలో ఇంకా 1.92 కోట్ల మంది తమ ఆధార్ కార్డులకు ఫోన్ నంబర్లు అనుసంధానించుకోవాల్సి ఉందని పోస్టల్ శాఖ తెలిపింది.
ఫోన్ నంబరు అనుసంధానం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏప్రిల్ ఒకటి నుంచి గుడివాడ, భీమవరం ప్రాంతాల్లో ప్రారంభించినట్టు ఏపీ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఆధార్ సీడింగ్ కేంద్రాల వద్ద చేసే అన్ని సేవలను తపాలశాఖ ఇంటి వద్దే అందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, ఐదేళ్లలోపు పిల్లల విషయంలో ఎలాంటి రుసుములు వసూలు చేయబోమన్నారు.