Telangana: అదృశ్యమైన జెన్‌కో ఉద్యోగి కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యం!

Genco Employee family commit Suicide by jumping krishna river
  • ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన రామయ్య కుటుంబం
  • సాగర్ కొత్త వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య
  • నల్గొండ జిల్లా సాగర్‌లో కలకలం రేపిన ఘటన
అనుమానించినదే నిజమైంది. భార్య, కుమారుడితో కలిసి అదృశ్యమైన జెన్‌కో ఉద్యోగి కుటుంబం కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక బాధలకు తోడు అనారోగ్య సమస్యలు వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించిన జెన్‌కో ఉద్యోగి.. తాను చనిపోతే భార్య, కుమారుడు అనాథలు అయిపోతారన్న ఉద్దేశంతో వారిద్దరితో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. స్థానికంగా నివాసం ఉండే మండారి రామయ్య (36) జెన్‌కోలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య నాగమణి (30), కుమారుడు సాత్విక్ (12) ఉన్నారు. రామయ్యకు గత కొంతకాలంగా తరచూ జ్వరం వస్తుండడంతో పది రోజుల క్రితం మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు.

నాలుగు రోజుల క్రితం చేయించుకున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన రామయ్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, తానొక్కడిని చనిపోతే భార్యాబిడ్డలు అనాథలైపోతారని భావించి అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని లేఖ రాసి ఇంట్లో పెట్టి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై సాగర్ కొత్త వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ బైక్, సెల్‌ఫోన్ వదిలిపెట్టారు.

తొలుత కుమారుడు సాత్విక్‌ను నదిలోకి తోసేశారు. ఆ తర్వాత రామయ్య, నాగమణి ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని దూకారు. జెన్‌కో ఉద్యోగి అదృశ్యం ఘటన కలకలం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొత్త వంతెన వద్ద రామయ్య బైక్, సెల్‌ఫోన్ కనిపించడంతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావించి గాలించారు.

ఈ క్రమంలో నిన్న ఉదయం చింతలపాలెం జమ్మనకోట తండా వద్ద నది ఒడ్డున సాత్విక్ మృతదేహం లభ్యం కాగా, ఆవలి ఒడ్డున రామయ్య, నాగమణి మృతదేహాలు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఉన్న స్థితిలో గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

తిరుమలగిరి (సాగర్) మండలం చింతలపాలేనికి చెందిన రామయ్య వ్యవసాయ భూమి టెయిల్‌పాడ్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైంది. నిర్వాసితులకు ఇచ్చే ఉద్యోగాల్లో భాగంగా రామయ్యకు జెన్‌కోలో అటెండర్ ఉద్యోగం లభించినట్టు పోలీసులు తెలిపారు.
Telangana
Nagarjuna Sagar
Genco
suicide

More Telugu News