Maharashtra: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 60 మంది మృతి

Land Slides Kill Atleast 60 In Maharashtra
  • కొంకణ్ , పశ్చిమ మహారాష్ట్రల్లో ఘటనలు
  • ఒక్క కొంకణ్ లోనే 36 మంది మృతి
  • 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వానలు
  • కాపాడుతుండగా మూడంతస్తుల నుంచి వరదలో పడిన మహిళ
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొంకణ్ తీర ప్రాంతం, పశ్చిమ మహారాష్ట్రల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 60 మంది చనిపోయారు. పదుల సంఖ్యల్లో రాతి శిథిలాల కింద చిక్కుకుపోయారు. కొంకణ్ లోని రాయగడ్ జిల్లా తలాయి గ్రామంలో కొండచరియలు ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో 36 మంది చనిపోయారు. ఒకేచోట 32 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో చోట నుంచి మరో 4 మృతదేహాలను తీశారు.

సతారా జిల్లాలోని మిర్గావ్ లో మరో 12 మంది బలయ్యారు. సతారాలోని అంబేగార్ లోనూ ఇలాంటి ఘటనే జరగడంతో పదుల సంఖ్యలో రాళ్ల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం వారందరినీ కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో భారీ వర్షానికి ఇల్లు కూలి నలుగురు వ్యక్తులు చనిపోయారు.

కాగా, మహారాష్ట్రలో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు ఇప్పుడు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజా జీవనం స్తంభించిపోయింది. స్థానిక అధికారులతో పరిస్థితిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

రత్నగిరి జిల్లాలోని చిప్లున్ లో వరద తాకిడికి కాలనీల్లో 12 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. కరెంట్, మంచినీళ్ల సరఫరా నిలిచిపోయింది. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలో చిక్కుకున్న ఓ మహిళను కాపాడే ప్రయత్నంలో ఆమె చెయ్యి జారి మూడంతస్తుల మీది నుంచి వరద నీటిలో పడిపోయింది. ఆ వీడియో వైరల్ అయింది. అక్కడే ఉన్న కొవిడ్ ఆసుపత్రి చుట్టూ వరద నీరు నిలిచింది.
Maharashtra
Rains
Lan Slides

More Telugu News