ఒలింపిక్ గ్రామంలో మరో ఇద్దరికి కరోనా... ప్రారంభోత్సవం ముంగిట మహమ్మారి కలకలం
- ఈ నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్
- ఇటీవల కీడ్రాగ్రామంలో ఒకరికి కరోనా
- అదే దేశానికి చెందిన మరో ఇద్దరికీ పాజిటివ్
- మూడుకు పెరిగిన కరోనా కేసులు
- ఒలింపిక్స్ పై ముసురుకుంటున్న సందేహాలు!
ప్రపంచ దేశాల నుంచి టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వచ్చే అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఓ టౌన్ షిప్ వంటి గృహసముదాయంలో బస ఏర్పాటు చేశారు. ఇందులో భారీ అపార్ట్ మెంట్ తరహా భవనాలు ఉంటాయి. వీటిలో 6,700 మంది అథ్లెట్లు బస చేస్తారని అంచనా. ఇన్ని వేలమంది ఉండే ఈ ఒలింపిక్ గ్రామంలో కరోనా కలకలం రేగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరో ఐదు రోజుల్లో ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఒలింపిక్ గ్రామంలో ఇంకెన్ని పాజిటివ్ కేసులు బయటపడతాయోనని భయపడుతున్నారు.
గతేడాది జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయి. ఓవైపు జపాన్ లో కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్నప్పటికీ ఒలింపిక్స్ జరపాలని అక్కడి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకే ప్రేక్షకులను అనుమతించకుండా క్రీడోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. కానీ అథ్లెట్లలోనే కరోనా కేసులు రావడంతో ఒలింపిక్స్ క్రీడలపై సందేహాలు ముసురుకుంటున్నాయి.