GVL Narasimha Rao: ఏపీలో రూ.లక్ష కోట్ల 'పీడీ' దోపిడీపై గవర్నర్ దృష్టి సారించాలి: నాటి టీడీపీ, నేటి వైసీపీ ప్రభుత్వాలపై జీవీఎల్ ఆరోపణలు

GVL wrote governor to interference into PD accounts issue
  • ఏపీ ఆర్థికశాఖపై పయ్యావుల విమర్శలు
  • స్పందించిన జీవీఎల్
  • టీడీపీ కూడా గతంలో ఇలాగే చేసిందని ఆరోపణ
  • రూ.53 వేల కోట్లు మళ్లించిందని వెల్లడి
  • గవర్నర్ కు లేఖ రాసిన జీవీఎల్
రూ.41 వేల కోట్లకు లెక్కలు ఏవంటూ టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గత కొన్నిరోజులుగా ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. వైసీపీ, టీడీపీ రెండూ రెండేనని వ్యాఖ్యానించారు. పారదర్శకత లేని పీడీ ఖాతాల ద్వారా వైసీపీ ప్రభుత్వం రూ.41 వేల కోట్లను మళ్లించిందని పేర్కొన్నారు. ఇదే తప్పుడు విధానాన్ని గతంలో టీడీపీ అనుసరించి రూ.53 వేల కోట్లను పీడీ ఖాతాల్లోకి మళ్లించిందని ఆరోపించారు.

ప్రభుత్వాలు మారినా పీడీ పేరుతో దోపిడీ కొనసాగుతోందని విమర్శించారు. ఏపీలో రూ.లక్ష కోట్ల పీడీ ఖాతాల వ్యవహారంపై గవర్నర్ విచారణ జరపాలని కోరారు. ఇవి పీడీ ఖాతాలా? లేక దోపిడీ ఖాతాలా? అని ప్రజల్లో ఆందోళన ఉందని, దీనిపై నిగ్గు తేల్చాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. వైసీపీ సర్కారు రూ.41 వేల కోట్లకు సంబంధించి పారదర్శకత లేకుండా వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసినట్టు కాగ్ తన తాజా నివేదికలో వెల్లడించిందని జీవీఎల్ తెలిపారు. గతంలో టీడీపీ సర్కారు రూ.53 వేల కోట్లకు పైగా పీడీ ఖాతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్టు 2016-17 నాటి కాగ్ రిపోర్టు చెబుతోందని వివరించారు.

కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే అధికారులు వినియోగించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పీడీ ఖాతాలు (పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్) అని వివరించారు. వీటిని పాలనా సౌలభ్యం నిమిత్తంగానే వినియోగించాలని, కానీ నిబంధనల నుంచి తప్పించుకోవడానికి, దారి మళ్లించి ఈ పీడీ ఖాతాల్లోకి ఇంత పెద్ద మొత్తలో నిధులను జమ చేయడం సరికాదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, పీడీ ఖాతాలపై వచ్చిన అభియోగాల మీద విస్తృతస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా, పీడీ ఖాతాలపై కాగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని, అదనంగా సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
GVL Narasimha Rao
Governor
Biswabhusan Harichandan

More Telugu News