Shekhar Kammula: శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ'కి విడుదల తేదీ నిర్ణయం?

Release date confirmed for Love Story film
  • నాగ చైతన్య, సాయిపల్లవిల 'లవ్ స్టోరీ'
  • పెద్ద హిట్టయిన 'సారంగ ధరియా' పాట  
  • కరోనా కారణంగా విడుదలలో జాప్యం 
  • రిలీజ్ డేట్ గా ఆగస్టు 7 ఖరారు?
దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలకు ఓ ప్రత్యేకత వుంది. అదేమిటంటే, వెకిలి హాస్యం కానీ.. ద్వంద్వార్థాల సంభాషణలు కానీ.. అసభ్యత కానీ సినిమాలో ఎక్కడా కనిపించవు. నీట్ సినిమా.. అనేలా ఉంటాయి. పైపెచ్చు అందమైన ప్రేమకథని అందర్నీ ఆకట్టుకునేలా.. ఇంటిల్లిపాదీ చూసేలా అందంగా తీస్తాడు. అందుకే, ఆయన సినిమాలకు ప్రత్యేకమైన ప్రేక్షకులు కూడా వున్నారు. ఆయన సినిమాల కోసం వారు ఎదురుచూస్తుంటారు. ఆయన తాజా చిత్రం 'లవ్ స్టోరీ' కోసం కూడా అలాగే ఎదురుచూస్తున్నారు.

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా దీనిని శేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని 'సారంగ ధరియా' పాట ఇప్పటికే యువతని ఓ ఊపు ఊపేస్తూ.. యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ తెచ్చుకుంటోంది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 16నే ప్రేక్షకుల ముందుకు రావాలి. అయితే, కరోనా రెండో వేవ్ ఉద్ధృతి కావడంతో వాయిదాపడిపోయింది. ఈ లోగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందంటూ ప్రచారం జరిగింది.

అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదనీ, వాస్తవానికి పది ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరికీ కమిట్ కాలేదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ చెప్పారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఆగస్టు 7న రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముహూర్తం నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం. దీనిపై త్వరలోనే నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది.
Shekhar Kammula
Naga Chaitanya
Sai Pallavi
Love Story

More Telugu News