ఢిల్లీ, ముంబైలలోని శాంసంగ్​ కార్యాలయాలపై డీఆర్​ఐ దాడులు

DRI Officials Raided Samsung Offices For Alleged Customs Evasion
  • కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలు
  • ఇటీవలే నెట్ వర్క్ పరికరాల దిగుమతి
  • అడ్డదారిలో తీసుకొచ్చారని ఆరోపణలు
శాంసంగ్ కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు దాడులు చేశారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలతో ముంబై, ఢిల్లీల్లోని ఆఫీసుల్లో సోదాలు చేశారని సమాచారం. ఇటీవలే శాంసంగ్ నెట్ వర్క్ పరికరాలను దిగుమతి చేసుకుందని, అయితే, వాటిని అడ్డదారిలో తెచ్చారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నెట్ వర్కింగ్ విధులు జరిగే ముంబై ఆఫీసు, ఢిల్లీలోని గురుగ్రామ్ లో ఉన్న ఇండియా హెడ్డాఫీస్ లలో తనిఖీలు చేశారని తెలుస్తోంది. బుధవారం జరిగిన ఈ దాడుల్లో దిగుమతులకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను పరిశీలించినట్టు అధికారులు చెబుతున్నారు. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాక సంస్థ సుంకాన్ని ఎగవేసిందా? లేదా? అన్నది తేల్చనున్నట్టు సమాచారం.

దీనిపై శాంసంగ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. దేశంలో 4జీ పరికరాల అతిపెద్ద విక్రయదారు శాంసంగే. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తో పాటు వివిధ సంస్థలకు 4జీ పరికరాలను సరఫరా చేస్తోంది. వాస్తవానికి సంస్థ సొంత దేశమైన దక్షిణ కొరియాతో పాటు, వియత్నాంలలో తయారు చేసిన టెలికం పరికరాలు, ఇతర ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కింద సంస్థకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఉంది.  అందులో భాగంగా టెలికం సేవలు, తరువాతి తరం వైర్ లెస్ నెట్ వర్క్ ల అభివృద్ధి, ఆధునికీకరణ, విస్తరణ వంటి విషయాల్లో పరస్పర సహకారం కోసం భారత్, దక్షిణ కొరియాల మధ్య ఎఫ్టీఏ కుదిరింది.

అయితే, శాంసంగ్ తాజాగా దిగుమతి చేసుకున్న పరికరాలు దక్షిణ కొరియాలోగానీ, వియత్నాంలోగానీ తయారు కాలేదని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఎఫ్టీఏలో భాగం కాని దేశంలో వాటిని తయారు చేసి వాటిని కొరియా, వియత్నాంల మీదుగా భారత్ లోకి తీసుకొచ్చారని ఓ అధికారి చెబుతున్నారు. ఇదే నిజమైతే దిగుమతి చేసుకున్న పరికరాలపై కచ్చితంగా సుంకాన్ని వేయాల్సి ఉంటుందన్నారు.
Go Back to Shorts
Samsung
Customs Duty
South Korea
DRI

More Telugu News