ఎస్వీ రంగారావు గారి అభినయం అనితర సాధ్యం: పవన్ కల్యాణ్
- నేడు ఎస్వీఆర్ జయంతి
- మహానటుల్లో అగ్రగణ్యుడన్న పవన్ కల్యాణ్
- అలవోకగా డైలాగులు చెబుతారని కితాబు
- చిరకీర్తిని ఆర్జించారన్న పవన్ కల్యాణ్
ఇవాళ ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానటుడ్ని స్మరించుకుంటూ తన తరఫున, జనసేన తరఫున అంజలి ఘటిస్తున్నట్టు పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘిక చిత్రాల్లో ఆయన ఏ పాత్ర పోషించినా మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో అభినయాన్ని ప్రదర్శించేవారని ప్రస్తుతించారు. విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా పాత్రకు జీవం పోసేవారని వెల్లడించారు. అందుకే కీచకుడిగా, ఘటోత్కచుడిగా, నేపాళ మాంత్రికుడిగా, హిరణ్యకశిపుడిగా, అక్బర్, భోజరాజు, తాండ్రపాపారాయుడు, తాతామనవడులో తాతగా... ఏ పాత్రలో అయినా ఎస్వీఆరే జ్ఞప్తికి వస్తారని పవన్ వివరించారు.
ఒక నటుడిగా ఎస్వీ రంగారావు గారు చిరకీర్తిని ఆర్జించారని, ఆయనను భావి తరాలు కూడా స్మరించుకుంటూనే ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఏ మీడియాలో చూసినా ఆయన నటించిన చిత్రాలు, వాటికి సంబంధించిన విశేషాలే దర్శనమిస్తున్నాయని వెల్లడించారు. వాటిని చూస్తుంటే ఎస్వీఆర్ మనపై ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థమవుతోందని పేర్కొన్నారు.