Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రేమ వ్యవహారంలో ఐదుగురిని చంపేసిన యువకుడు!

Bodies of Five Members of Tribal FamilyMissing for Weeks Exhumed from MP Farm
  • మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బయటపడిన ఐదు అస్థిపంజరాలు
  • ప్రియురాలు, ఆమె తల్లి, సోదరితోపాటు మరో ఇద్దరిని చంపేసిన నిందితుడు
  • సహకరించిన సోదరుడు, మరో నలుగురు
తమ కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఓ దారుణ విషయం బయటపడింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకుడు.. మాట్లాడుకుందామంటూ యువతిని పిలిపించి, ఆమె సహా ఐదుగురిని దారుణంగా హత్యచేసి పాతిపెట్టేశాడు.

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవాస్ పట్టణం నేమావర్ గ్రామానికి చెందిన మోహన్‌లాల్ కాస్తే భార్య మమత (45), కుమార్తెలు రూపాలి (21), దివ్య (14) తోపాటు రవి ఓస్వాల్ కుమార్తె పూజ (15), కుమారుడు పవన్ (14) మే 13వ తేదీ నుంచి అదృశ్యమయ్యారు.

వారి కోసం గాలించినప్పటికీ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే గ్రామానికి చెందిన సురేంద్రసింగ్ చౌహన్, అతడి సోదరుడు భురూ చౌహాన్‌లను విచారించగా ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన ఆ ఐదుగురిని తామే హత్య చేశామని, అనంతరం తమ వ్యవసాయ క్షేత్రంలో పాతిపెట్టామని చెప్పారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీ సాయంతో వారి అస్థిపంజరాలను వెలికి తీశారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. నిందితుల్లో ఒకడైన సురేంద్ర సింగ్, రూపాలి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సురేంద్రసింగ్ ఇటీవల మరో అమ్మాయితో వివాహానికి సిద్దమయ్యాడు. విషయం తెలిసిన రూపాలి, ఆమె కుటుంబ సభ్యులు సురేంద్రను నిలదీశారు. దీంతో ఈ విషయమై మాట్లాడుకుందామని, తమ పొలం వద్దకు రావాలని వారికి చెప్పాడు.

దీంతో తల్లి మమత, సోదరి దివ్య, పూజ, పవన్‌లను తీసుకుని రూపాలి అతడి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లింది. అక్కడ వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన సురేంద్రసింగ్.. సోదరుడు భూరూసింగ్‌తోపాటు మరో నలుగురి సహకారంతో వారందరినీ హత్యచేసి అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మిగతా నలుగురినీ అరెస్ట్ చేశారు.
Madhya Pradesh
Tribal Family
Love Affair
Murder

More Telugu News