Corona Virus: కరోనా వైరస్ ఇప్పటిది కాదు.. 20 వేల ఏళ్ల క్రితమే ముంచెత్తిన మహమ్మారి!

East Asia faced a coronavirus epidemic 20000 years ago
  • చైనా, జపాన్, వియత్నాంలలో 20 వేల ఏళ్ల క్రితమే మహమ్మారి విజృంభణ
  • అక్కడి ప్రజల డీఎన్ఏలో వైరస్ ఆనవాళ్లు
  • వైరస్‌కు అనుగుణంగా జన్యువుల్లో సర్దుబాటు
  • ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఈనాటిది కాదని, 20 వేల ఏళ్ల క్రితమే ఇది చైనా, జపాన్, వియత్నాంలలో వ్యాపించిందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. అక్కడి ప్రజల డీఎన్ఏలలో వైరస్ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. కరోనా వైరస్‌కు అనుగుణంగా వారి జన్యువుల్లో సర్దుబాట్లు జరిగినట్టు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ల సమూహంలోని మెర్స్, సార్స్ రకాల వల్ల గత 20 ఏళ్లలో మహమ్మారులు ఉత్పన్నమయ్యాయని, ఆది మానవుల సమయంలోనూ వ్యాధికారక సూక్ష్మజీవులు విజృంభించాయని చెప్పారు. ఆది మానవుడు ఆఫ్రికా నుంచి ప్రపంచమంతా విస్తరించే క్రమంలో ఎన్నో కొత్త సూక్ష్మజీవులను ఎదుర్కొన్నాడని, ఈ క్రమంలో వాటి ఇన్ఫెక్షన్లను తట్టుకుని మనుగడ సాధించే సామర్థ్యాన్ని సాధించారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వేల ఏళ్లనాటి వైరస్ ఆనవాళ్లు ఇంకా మానవుల జన్యువుల్లో ఉన్నాయని పేర్కొన్నారు.

గతంలోని కరోనా మహమ్మారులను గుర్తించేందుకు 2,500 మంది జన్యుక్రమాలను అధునాతన విధానాలతో విశ్లేషించగా ఈ విషయం వెలుగుచూసింది. వైరల్ ఇంటరాక్టింగ్ ప్రొటీన్లను (వీఐపీ) ఉత్పత్తి చేసే 42 జన్యువుల్లో కరోనా వైరస్‌కు అనుగుణంగా సర్దుబాట్లు జరిగినట్టు గుర్తించారు. జన్యువుల్లో మార్పులు చోటుచేసుకున్న వారందరూ తూర్పు ఆసియా దేశాల వారే కావడం గమనార్హం. దీనిని బట్టి ఈ దేశాలకు చెందిన పూర్వీకులు 20 వేల ఏళ్ల క్రితమే కరోనాకు గురైనట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Corona Virus
China
Japan
Vietnam

More Telugu News