RBI: సెకండ్​ వేవ్​ తో రూ.2 లక్షల కోట్ల నష్టం: జూన్​ బులెటిన్​ లో ఆర్బీఐ

2 Lakh Crore Likely Loss To Economy From Covid Second Wave Says RBI Report
  • గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయిన డిమాండ్
  • ఇంకా ఒడిదుడుకుల పరిస్థితులే
  • నిలబెట్టిన వ్యవసాయం, కాంటాక్ట్ లెస్ సేవలు
  • పుంజుకున్న పారిశ్రామికోత్పత్తి, ఎగుమతులు
కరోనా సెకండ్ వేవ్ తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. జూన్ కు సంబంధించి నెలవారీ బులెటిన్ లో ఈ విషయాన్ని ప్రకటించింది. పల్లెలు, చిన్న పట్టణాలకూ వైరస్ విస్తరించడం, ప్రాంతాల వారీగా లాక్ డౌన్ లు విధించడం వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బాగా తగ్గిపోయిందని అందులో పేర్కొంది.  

ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశాభావంతోనే ముందుకెళ్తున్నప్పటికీ ఇంకా ఒడిదుడుకుల పరిస్థితులే ఉన్నాయని అందులో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డొమెస్టిక్ డిమాండ్ (గృహ వినియోగం) బాగా పడిపోయినప్పటికీ.. వ్యవసాయం, కాంటాక్ట్ లెస్ సర్వీసులు మెరుగ్గా రాణించాయని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పారిశ్రామికోత్పత్తి, ఎగుమతులు గణనీయంగా పెరిగాయంది.

వ్యాక్సినేషన్ ఎంత వేగంగా జరిగితే ఆర్థిక వ్యవస్థ అంత బలంగా పుంజుకుంటుందని అభిప్రాయపడింది. స్థూల ఆర్థికవ్యవస్థ పరంగా చూస్తే 2019 రెండో త్రైమాసికం నుంచి సావరిన్ బాండ్ ఈల్డ్ బాగా తగ్గిపోయిందని తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీపనలను ప్రకటించిందని, అందుకు అనుగుణంగా ఆర్థిక గమనంలో మార్పులుచేర్పులు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆర్థిక వృద్ధిని మళ్లీ గాడిలో పెట్టాలంటే మూలధనం–రెవెన్యూ వ్యయాల నిష్పత్తి, రెవెన్యూ లోటు–ఆర్థిక లోటు నిష్పత్తిని బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
RBI
COVID19
Economy

More Telugu News