Chandrababu: ఈ హత్యల వెనుక కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉంది: చంద్రబాబు

Katasani Rambhupal Reddy behing murders says Chandrababu
  • పాణ్యం నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య
  • వైసీపీ నేతలు, పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదన్న చంద్రబాబు
  • ఇప్పటి వరకు 30 మంది నేతలను చంపేశారన్న బాబు
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు దారుణహత్యకు గురికావడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యల వెనుక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ హత్యలకు వైసీపీ నేతలు, పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ పని చేస్తోందో, లేదో అర్థం కావడం లేదని చంద్రబాబు విమర్శించారు. పట్టపగలే టీడీపీ నేతలను హత్య చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువు చిన్నదినం కార్యక్రమం కోసం శ్మశానానికి వెళ్లి వస్తున్న నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి దారుణంగా హతమార్చారని అన్నారు.

ప్రజలను రక్షించాల్సిన పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారని... 1500 మందికి పైగా నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని, ఎందరో ఆస్తులను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి దారుణాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని అన్నారు. హత్యాకాండలకు పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 
Chandrababu
Telugudesam
Katasani Rambhupal Reddy
ysr
Kurnool District
Murders

More Telugu News