Army: ‘పాంగోంగ్​’ బలగాలకు 17 మర పడవలు కొనుగోలు చేసిన ఆర్మీ

Indian Army Buys 17 Boats To Move Troops Across Pangong Tso
  • గోవా కంపెనీ ఆక్వేరియస్ షిప్ యార్డ్ నిర్మాణం
  • ఇప్పటికే కొన్నింటిని అందజేసిన సంస్థ
  • సెప్టెంబర్ నాటికి మిగతావి ఆర్మీకి
  • చైనాతో ఘర్షణల నేపథ్యంలో నిర్ణయం
పాంగోంగ్  సరస్సు వద్ద బలగాలు మరింత వేగంగా వెళ్లడానికి వీలుగా ఆర్మీ 17 మర పడవలను కొనుగోలు చేసింది. శత్రు దేశాల సైనికులు ఆక్రమణలకు ప్రయత్నిస్తే బలగాలను వేగంగా తరలించేందుకు వీటిని వినియోగించనున్నారు. కొన్ని నెలల క్రితం తూర్పు లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు వద్ద చైనా దురాక్రమణలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల ఘర్షణ వాతావరణం తర్వాత కమ్యూనిస్ట్ దేశం వెనక్కు తగ్గింది.

అయితే, ఇప్పటికీ హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పోస్ట్ నుంచి వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. ఇటీవలే అక్కడ మళ్లీ బలగాలను మోహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనాకు దీటుగా బదులిచ్చేందుకే ఈ పడవలను కొనుగోలు చేసినట్టు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. గోవాకు చెందిన ఆక్వేరియస్ షిప్ యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ పడవలను అందిస్తుందని సమాచారం. ఇప్పటికే కొన్ని మరపడవలున్నా వాటికి తోడు ఇవీ ఉంటే మరింత బలం పెరిగినట్టవుతుందని చెబుతున్నాయి.

ఇప్పటికే కొనుగోలు చేసిన వాటిలో కొన్ని బోట్లను సంస్థ అప్పగించింది. మిగతా బోట్లను సెప్టెంబర్ నాటికి అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. కాగా, ఒక్కో పడవ 35 అడుగుల పొడవుంటుంది. 20 నుంచి 22 మందిని పడవ మోసుకెళ్లగలదు. గంటకు 37 కిలోమీటర్ల వేగంతో నీటిపై దూసుకెళ్లగలదు. ప్రస్తుతం వాటికి ఎలాంటి ఆయుధాలనూ అమర్చలేదని, భవిష్యత్ లో అవసరాలను బట్టి తేలికపాటి ఆయుధాలను అమరుస్తామని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు.
Army
Pangong Tso
Ladakh
China
India

More Telugu News