Vellampalli Srinivasa Rao: ఆలయాల వద్ద 40 వేల సీసీ కెమెరాలను అమర్చాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి
- ఆలయాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలను చేపడుతున్నాం
- ఆలయాల స్థలాలను అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకుంటాం
- చంద్రబాబు హయాంలో 40 ఆలయాలను కూల్చారు
రాష్ట్రంలోని దేవాలయాలను, దేవాదాయశాఖ భూములను కాపాడుకునేందుకు అన్ని చర్యలను చేపడుతున్నామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. దేవాలయాలకు చెందిన కమర్షియల్ స్థలాలను అభివృద్ధి చేసి, ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పారు.
ఆలయాలకు చెందిన అనేక భూములను చంద్రబాబు ధారాదత్తం చేశారని... ఎలాంటి ఆక్రమణలు లేకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆలయాల వద్ద 40 వేల సీసీ కెమెరాలను అమర్చామని చెప్పారు. చంద్రబాబు హయాంలో 40 ఆలయాలను కూల్చారని... వాటిని పునర్నిర్మించేందుకు జగన్ పూనుకున్నారని చెప్పారు.
మరోవైపు మరో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, దేవాలయాలపై సమీక్ష జరగడం ఇదే తొలిసారని అన్నారు. వంద ఇళ్లు ఉన్న ప్రతి చోట ఆలయం నిర్మించాలనుకుంటున్నామని చెప్పారు. జగనన్న కాలనీలు పెద్ద గ్రామాలుగా మారనున్నాయని అన్నారు.